వెహికల్స్ ఓనర్స్‌కు ఇలా కుచ్చుటోపీ: రిమోట్ చిప్స్‌తో పెట్రోల్ తస్కరణ

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ / అమరావతి: వాహనాలకు పెట్రోల్, డీజిల్ కావాలి. వాటి యజమానులు పెట్రోల్, డీజిల్ కోసం నిత్యం పెట్రోల్ బంక్‌లకు వెళతారు. ఆయా పెట్రోల్ బంక్‌లో లీటర్‌లో పూర్తిగా వెయ్యి మిల్లీలీటర్లు ట్యాంకులోకి చేరుతుందని అనుకుంటే పొరపాటే. వాహన ట్యాంకులోకి చేరుతున్నది 900 నుంచి 950 మిల్లీలీటర్లే! మిగతామొత్తం బంకు యజమానులే నొక్కేస్తున్నారన్న మాట! రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ పెట్రోలు బంకుల్లో ఇదే తంతు. ప్రతి లీటరుపై 5 నుంచి 12 శాతం వరకు తక్కువగా పోస్తూ వినియోగదారుడికి కుచ్చుటోపీ పెడుతున్నారు. పెట్రోలు పంపుల్లో అమరుస్తున్న సాంకేతిక చిప్‌ల సాయంతో ఈ మోసానికి పాల్పడుతున్నారు.

ఒక్కో వినియోగదారుడు లీటర్‌పై నష్ట పోయింది కేవలం 50 మిల్లీలీటర్లో, 100 మిల్లీలీటర్లో కావొచ్చు.. అది పెద్దమొత్తంగా కనిపించకపోవచ్చు కానీ.. ఈ తతంగం వెనుక జరుగుతున్న నష్టం అక్షరాల కోట్ల రూపాయల్లో ఉంటున్నది. కొందరు అధికారుల అవినీతి కారణంగా ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వినియోగదారుడి అవగాహన లేమే పెట్టుబడిగా పెట్రోలు బంకుల యజమానులు, అక్కడ పనిచేసే సిబ్బంది రెచ్చిపోతున్నారు. కొన్ని బంకుల్లో పెట్రోలులో కిరోసిన్‌, నాఫ్తా కూడా కల్తీ చేస్తున్నారు. ఏ బంకులో పెట్రోలు, డీజిల్‌ కొలతలు కచ్చితంగా ఉంటాయి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయన్నది వినియోగదారులకు చిక్కుప్రశ్నే.

పెట్రోల్ బంకుల్లో రిమోట్ ఆధారంగా చౌర్యం
అక్రమార్కులు రిమోట్‌ ఆధారంగా పెట్రో చౌర్యానికి పాల్పడుతున్నారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు ఏటా ఒకదఫా పెట్రోలు బంకును తనిఖీచేసి, యంత్రానికి సీలు వేసినప్పుడే అక్రమానికి బీజం పడుతోంది. అవినీతి అధికారుల అండతో.. సీలు వేసే సమయంలోనే రిమోట్‌తో పనిచేసే చిప్‌ను యంత్రంలో అమరుస్తున్నారు. మదర్‌బోర్డులో కంపెనీ చిప్‌ బదులు బంకుల యజమానులు చిప్‌ను పెడుతున్నారు. భూగర్భంలో ఉన్న నిల్వ కేంద్రం నుంచి మోటారు ద్వారా ఇంధనం పెట్రోలు పంపు నుంచి వాహనంలోకి చేరుతుంది.

Petrol pumps cheating in Telangana & AP

ముందే రిమోట్ ఆధారిత చిప్ ఏర్పాటు
పంపు నుంచి ఎంత మొత్తంలో చమురు వస్తుందో కొలిచే పరికరాల వద్ద రిమోట్‌ అధారిత చిప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. లీటరు పెట్రోలుకు ఎన్ని మిల్లీలీటర్లను తగ్గించాలన్నది ముందుగానే నిర్ధారించి సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రోగ్రామింగ్‌ చేస్తారు. ఆ నిర్ధారిత ప్రాంతానికి వచ్చేలోగా మీటరు వేగంగా తిరుగుతుంది. అక్రమార్కులు కోరుకున్న మేరకు వారికి చమురు మిగిలిపోతుంది. చూడటానికి పంపులు సీలు వేసినట్లే కనిపిస్తుంటాయి. పైకి మాత్రం రీడింగ్‌లో అంతా సవ్యంగానే కనిపిస్తుంటుంది. కానీ తెరమాటున దోపిడీ యథేచ్ఛగా సాగిపోతుంది. వినియోగదారుడు దీనిని ఎంతమాత్రం గుర్తించలేని పరిస్థితి. చమురు సంస్థల అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మాత్రం రిమోట్‌ ద్వారా ఆ చిప్‌ పనితీరును నిలిపివేస్తారు.

ఇదే కేరళ ముఠా పనే!
కేరళకు చెందిన ఓ ముఠా విదేశాల నుంచి చిప్స్‌, సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుచేసి ముంబై కేంద్రంగా ఈ భాగోతం నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముంబైలోని హిందుస్థాన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో పంపుల మెకానిక్‌ ఈ అక్రమాలకు సూత్రదారి. చమురు సంస్థల ప్రతినిధులు ప్రతి మూడు నెలలకోసారి పెట్రోలు బంకుల్ని తనిఖీ చేస్తారు. వారికి అనుమానం వచ్చినప్పుడు తూనికలు, కొలతల శాఖ అధికారుల సమక్షంలో సీలును తొలగించి తనిఖీ చేస్తారు. అందులో ఏమైనా చిప్‌ ఉన్నట్లు గుర్తించిన పక్షంలో కేసులు నమోదుచేస్తారు. గత ఏడాది కాలంలో ఇలాంటి అనుమానంతో సీలును తొలగించి తనిఖీచేసిన దాఖలాల్లేవని చమురు సంస్థల ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

హైదరాబాద్‌లో మూడేళ్ల కిందటే వెలుగులోకి
పెట్రోలు పంపుల్లో చిప్‌లు పెట్టి అక్రమానికి పాల్పడుతున్న వైనాన్ని 2013-14లోనే హైదరాబాద్‌లో గుర్తించారు. భాగ్యనగరంలోని 77 బంకుల్లో ఈ మోసం జరుగుతోందని సైబరాబాద్‌కు చెందిన ఎస్‌వోటీ బృందం గుర్తించింది. ప్రతి వెయ్యి లీటర్లకు 40 లీటర్ల పెట్రోలు తక్కువగా పోస్తున్నట్లు గుర్తించారు. నాడు కేసు నమోదుచేసిన సంబంధిత అధికారులకు ఆ తర్వాత స్థానం చలనం తప్పలేదు. తర్వాత పెట్రోలు పంపుల్లో చిప్‌లను పట్టించుకున్న నాథుడు లేడు.

వేతనాలు తక్కువైన సిబ్బంది అక్రమాల బాట
పెట్రోలు పంపుల్లో మోసాలకు కొందరు యజమానులు ఒక కారణమైతే, సిబ్బంది చేతివాటం మరో కారణం. పెట్రోలు పంపుల్లో పనిచేసే వారికి ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల నెలకు రూ.4 వేల వేతనం కూడా ఇస్తున్నారు. ఎనిమిది గంటలు పని చేయాలి. దాంతో సిబ్బంది రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.2000 వరకు అక్రమాల దారిలో ఆర్జించే ప్రయత్నిస్తున్నారు. దేశంలోని 28 వేల పెట్రోలు పంపుల్లో వినియోగిస్తున్న పంపులు 2009 నాటి కన్నా ముందు ఉన్నవి. వీటిలో సాంకేతికంగా రీడింగ్‌ తారుమారయ్యే అవకాశాలున్నాయి. వాటిని మార్చాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ 2011లోనే చమురు కంపెనీలకు చెప్పినా ఇప్పటి వరకూ పట్టించుకోలేదు.

Petrol pumps cheating in Telangana & AP

కల్తీ గుర్తింపు ఇలా తేలిక
కల్తీ పెట్రోలు గురించి పెట్రోలు పంపులోనే తెలుసుకోవడం చాలా తేలికవుతుంది. ఒక తెల్లకాగితంపై చుక్క పెట్రోలు పోస్తే.. అది వెంటనే ఎలాంటి మరక లేకుండా ఆవిరైపోతే స్వచ్ఛమైన పెట్రోలు కింద లెక్క. ఎలాంటి మరక ఉన్నా ఆ పెట్రోలు కల్తీ అయినట్లే నిర్ధారించుకోవచ్చు. పెట్రోలు బంకుల్ని పూర్తిస్థాయిలో చమురు సంస్థల కార్యాలయాలకు అనుసంధానం చేస్తే అక్రమాలు తగ్గుముఖం పడతాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. వాహనాన్ని అపరిచిత వ్యక్తి మారుతాళంతో తీసేందుకు ప్రయత్నిస్తే ఎలా అప్రమత్తం చేస్తుందో పంపుల్ని కూడా ఆ తరహా సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానించాలి. అక్కడక్కడా ఈ పని జరుగుతున్నా పకడ్బందీగా లేదు. పంపుల నుంచి భూగర్భ ట్యాంకుల దాకా అన్నింటినీ చమురు సంస్థల కార్యాలయాలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని చమురు సంస్థల ప్రతినిధులు సైతం అంగీకరిస్తున్నారు. ఖర్చుతో కూడుకున్నది కావటంతో పాటు, దీనిపై ప్రభుత్వం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిందిది..
ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రాష్ట్ర రాజధాని లక్నోలోని 11 పెట్రోలు బంకుల్లో తనిఖీ చేస్తే తొమ్మిది బంకుల్లో లీటరుకు వంద మిల్లీలీటర్ల పెట్రోలు/డీజిల్‌ తక్కువగా వస్తున్నదని గుర్తించారు. ఇందుకు ఆధునిక చిప్స్‌ వినియోగించారని, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ముఠా పెట్రోలు పంపుల యజమానులతో కుమ్మక్కుయి ఈ పని చేస్తోందని గుర్తించడం సంచలనమైంది. ఇతర రాష్ట్రాల్లో కూడా చిప్‌లను తాము విక్రయించినట్లు వాటి సరఫరా దారులు పోలీసు విచారణలో తేల్చారు. దీంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమై.. దేశవ్యాప్తంగా తనిఖీలకు ఆదేశించింది. దేశంలో వినియోగిస్తున్న పెట్రోలులో 10 శాతం కల్తీ జరుగుతోందని కేంద్రం అంచనా వేసింది.

ఏపీలో అక్రమాల పుట్టలు ఇలా..
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో తూనికలు, కొలతలు శాఖ 2021 పంపుల్లో తనిఖీలు చేసి 277 కేసుల్ని నమోదు చేసి.. రూ.48,57,500 జరిమానా వసూలు చేసింది. కేవలం విశాఖపట్నంలోనే 79 బంకుల్లో రోజుకు సగటున 1.90 లక్షల లీటర్ల మేర పెట్రోలు విక్రయిస్తున్నా. వీటిలో కనీసం 22 వేల లీటర్లు అక్రమంగా నొక్కేస్తున్నారనేది అధికారిక అంచనా. దీని ప్రకారం లీటరుకు రూ.74 చొప్పున సుమారు రూ.16 లక్షల మేర వినియోగదారులు నష్టపోతున్నారని తెలుస్తున్నది. విజయవాడ నగరంలోని ఒక ప్రధాన రహదారిపై ఉండే పెట్రోలు పంపు వద్దకు పెట్రోలు కోసం వెళ్లాలంటనే తెలిసినవారు భయపడుతుంటారు. ఇటీవలే ఆ పెట్రోలు పంపులో తనిఖీలు జరిగి కల్తీ, మోసాలు పట్టుబడ్డాయి.

మాటలతో పెట్రోల్ బంకుల్లో మాయ ఇలా..
ఉదాహరణకు మీరు రూ. 1000లకు పెట్రోలు పట్టించుకుంటున్నారనుకోండి. అతడు సరిగ్గా వినకుండా తొలుత రూ.200లకు పడతాడు. మిమ్మల్ని అనవసరంగా మాటల్లో దించి మరొకరికి పెట్రోలు పట్టి.. వారి రీడింగు నుంచే మిగిలిన పెట్రోలు మీకు పడతాడు. ఫలితంగా కనీసం రూ.వంద నుంచి రూ.200 వరకూ వినియోగదారుడు నష్టపోతున్నాడు. కొన్ని చోట్ల పెట్రోలు పంపుల్లో పొడవు పైపులు ఉంటాయి. వాటిలో రీడింగ్‌ సవ్యంగా చూపిస్తున్నా ఆ పెట్రోలు పరిమాణం ప్రకారం వాహన ట్యాంకులో పడదు. కొన్ని మిల్లీ లీటర్ల పెట్రోలు అక్కడే ఉండిపోతుంది.

ఇలా కిరోసిన్‌, నాఫ్తా కల్తీ
పెట్రోలులో కిరోసిన్‌, నాఫ్తాను కల్తీ చేసి అమ్మేస్తున్నారు. సహజంగా పెట్రోలు పంపులోని భూమిలో 9 వేలు, 14 వేలు, 24 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లు ఉంటాయి. వాటిలో కిరోసిన్‌, నాఫ్తాను నాలుగు నుంచి ఐదు వేల లీటర్లు కలిపేస్తున్నారని తేలింది. తెల్ల కిరోసిన్‌, నాఫ్తాను కలిపేస్తే ఇక పెట్రోలులో కల్తీ జరిగినట్లు గుర్తించడం కూడా కష్టమే. పలు పట్టణాల్లో ఇలాగే జరగుతోందన్నది బహిరంగ రహస్యమే.

కొన్ని పెట్రోల్ బంకుల్లోనే మోసాలు
పెట్రోలు బంక్‌లన్నిటిలో మోసాలు జరుగుతున్నాయనడం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్ గోపాలకృష్ణ చెప్పారు. కొంతమంది చేస్తున్నారన్నది కాదనలేని నిజమని గోపాలకృష్ణ తెలిపారు. అందుకే తనిఖీలు చేయాలని, దాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కొంతమంది వల్ల నిజాయతీగా దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేస్తున్నవారికి చెడ్డపేరు వస్తోందని, దీనికి అందరూ బాధ్యత వహించాలని, తప్పుచేసిన వారిని శిక్షించాలని కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Petrol pumps has cheated vehicle owners in Telangana and Andhra Pradesh. Petrol pumps managements has put remote chips in petrol supply machines
Please Wait while comments are loading...