రేవంత్ ప్రభుత్వం పై గురి పెట్టిన ప్రధాని మోదీ..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. హైడ్రా నిర్మాణాలతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాల కూల్చివేతపై ప్రతిపక్షాలు రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. రైతు రుణమాఫీ పూర్తి కాకపోవటం పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఇదే సమయం లో నేరుగా ప్రధాని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన గురి పెట్టారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
రుణమాఫీపై ప్రధాని వ్యాఖ్యలు
తెలంగాణలో రాజకీయంగా బలం పెంచుకోవటం పైన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను తమకు అధికారం తెచ్చాయని నమ్ముతున్న కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలోనే ఇదే తరహా గ్యారంటీలను ఇస్తోంది. హర్యానా, జమ్ము ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటంతో త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకు రుణమాఫీ అమలు ఇచ్చి అమలు చేయటం లేదని ఆరోపించారు. తాజాగా రేవంత్ ప్రభుత్వం పై విమర్శలు చేసారు.

కాంగ్రెస్ లక్ష్యంగా
తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని ప్రధాని ఆరోపించారు. ఈనాటికీ అక్కడ రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీ హయాంలో చేపట్టిన నీటిపారుదల పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో పర్యటించిన ప్రధాని..అక్కడ త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసారు. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలులో వైఫల్యం చెందిందని విమర్శించారు.
ప్రధాని వ్యాఖ్యలతో
కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉద్దేశించిన సొమ్ములో అవినీతికి పాల్పడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. రైతుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రధానంగా పేదల నివాసాల కూల్చివేత, రైతు రుణమాఫీ పైన టార్గెట్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ చేసామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇంకా రుణమాఫీ జరగని వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తోంది. ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీ తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరగలేదని విమర్శించటంతో..ముఖ్యమంత్రి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications