Dil Raju: రాజకీయాల్లోకి నిర్మాత దిల్ రాజ్.. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారా..!
సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ప్రముఖ నిర్మాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజ్ తన సొంత నియోజకవర్గమైన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే దిల్ రాజ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా.. లేకా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా అనేదాని చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీలతో దిల్ రాజ్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దిల్ రాజ్ త్వరలో ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీలో చేరుతారని సమాచారం.
దిల్ రాజు అలియాస్ వెంకటరమణారెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లి. ఆయన తాజాగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఛైర్మన్ గా విజయం సాధించారు. ఆయన ఛైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా.. తాను ఏ పొలిటికల్ పార్టీ తరుఫున్ పోటీ చేసినా ఎంపీగా విజయం సాధిస్తానని అన్నారు. అయితే తన మొదటి ప్రాధాన్యత సినిమా రంగానికే ఉంటుందని స్పష్టం చేశారు. దిల్ రాజ్ ఇప్పటికే నర్సింగ్ పల్లిలో మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం దిల్ రాజ్ తన గ్రామంలో ఇందూరు తిరుమల పేరుతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. దిల్ రాజ్ ప్రతి నెలా పౌర్ణమి రోజున 16 ఏండ్లలోపు పిల్లలకు స్వర్ణామృత ప్రాశన పేరుతో ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే గర్భిణులకు ప్రత్యేక ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. దిల్ రాజ్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 12 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఆయన ఎప్పటికైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దిల్ రాజ్ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలంటే.. ఆయనకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఛాన్స్ గా ఉన్నాయి. బీజేపీలో అక్కడ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉన్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ స్థానానికి కవిత పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆమె కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో దిల్ రాజ్ కాంగ్రెస్ నుంచే పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అక్కడ మధుయాష్కి గౌడ్ ఉన్నా.. ఆయన తన స్థానాన్ని మార్చుకునే అవకాశం ఉంది.
ఈసారి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కవిత ఎమ్మెల్యే పోటీ చేస్తే దిల్ రాజ్ బీఆర్ఎస్ లో చేరి ఎంపీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications