బ్రహ్మం గారు చెప్పిందే మళ్లీ నిజమైందా ? పంది కడుపున ఏనుగు పిల్ల జననం ??
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకున్న ఒక అరుదైన ఘటన స్థానికులను మాత్రమే కాకుండా నెట్టింట కూడా చర్చకు తెరలేపింది. సాధారణంగా పందికి పందే పిల్లలుగా పుట్టడం సహజం. కానీ ఈసారి ప్రకృతి ఒక విచిత్ర మలుపు తీసుకున్నట్టుగా కనిపించింది. ఒక పంది ఏనుగు పోలికలతో ఉన్న పిల్లకు జన్మనివ్వడం గ్రామంలోనే కాకుండా సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
కాగా గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందుల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల అతని వద్ద ఉన్న పంది ఏడు పిల్లలకు జన్మనివ్వగా.. వాటిలో ఒకటి పూర్తిగా భిన్నంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పందిపిల్లకు తొండంలా పొడవైన ముక్కు, పెద్ద చెవులు ఉండటం వల్ల అది అచ్చం చిన్న ఏనుగులా కనిపిస్తుంది. ఈ వింత రూపాన్ని చూసిన వెంటనే వెంకటయ్యతో పాటు కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.

ఈ వార్త క్షణాల్లోనే చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు సైతం.. పెద్ద సంఖ్యలో వెంకటయ్య ఇంటికి చేరుకుని ఆ పందిపిల్లను చూడటానికి పోటెత్తారు. కొందరు మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన మరింత వైరల్ అయింది. కొందరు దీనిని దైవ సంకేతంగా భావిస్తుండగా, మరికొందరు ఆశ్చర్యంతో చూడటమే తప్ప కారణం ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఇదే సమయంలో గ్రామంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ ఘటనను పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంతో ముడిపెట్టి చర్చించగా మరికొందరు ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమేనని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వింత పంది పిల్ల పుట్టిన కొద్దిసేపటి తర్వాత మృతి చెందినట్టు చెబుతున్నారు. అలానే దానితో పాటు మరో పందిపిల్ల కూడా చనిపోయినట్లు యజమాని తెలిపారు. మిగిలిన ఐదు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు.
ఈ ఘటనపై పశువైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇది ఎలాంటి అద్భుతం కాదని, జన్యుపరమైన లోపం (కన్జెనిటల్ అబ్నార్మాలిటీ) కారణంగా ఇలాంటి ఆకృతులు వస్తాయని తెలిపారు. గర్భస్థ దశలో పిండం అభివృద్ధి సరిగా జరగకపోవడం వల్ల శరీర నిర్మాణంలో మార్పులు ఏర్పడతాయని వివరించారు. ఇలాంటి జీవులు సాధారణంగా ఎక్కువకాలం బతకలేవని కూడా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటుంటాయి. గతంలో రెండు తలల గొర్రెపిల్లలు, ఎనిమిది కాళ్ల మేకపిల్లలు జన్మించిన ఘటనలు కూడా నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications