హైదరాబాద్‌లో త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్!
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. రాబోయే తరాల కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా రాజధానిలో త్వరలోనే 'క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని సువర్ణ దుర్గా టెక్ పార్కులో అమెరికాకు చెందిన ప్రముఖ బిజినెస్ అనలిటిక్స్, ఏఐ సంస్థ 'స్ప్లాష్ బీఐ' ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాదిలో 100 కొత్త జీసీసీలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తూ నగరంలో పరిశ్రమల వృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే 550కి పైగా జీసీసీలు విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వచ్చే ఏడాది కాలంలో మరో 100 కొత్త జీసీసీలను హైదరాబాద్‌కు రప్పించడమే ప్రభుత్వ సంకల్పం అన్నారు .అత్యుత్తమ మౌలిక వసతులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఇంజనీరింగ్, సాంకేతిక ప్రతిభ ఇక్కడ అందుబాటులో ఉండటం వల్లే బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి.
ఈ కేంద్రాలు కేవలం కార్యాలయ పనులకే పరిమితం కాకుండా AI, డేటా అనలిటిక్స్, క్లౌడ్ సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఆవిష్కరణలకు కేంద్ర బిందువులుగా ఎదుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో సేవలందిస్తున్న స్ప్లాష్ బీఐ సంస్థ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో హైదరాబాద్ కేంద్రంలో 100 మిలియన్ డాలర్ల సుమారు రూ. 840 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వివరించారు.
ఈ విస్తరణతో స్థానిక యువతకు ఉన్నత స్థాయి సాంకేతిక ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభించనున్నాయి. సాంప్రదాయ సూపర్ కంప్యూటర్లు పరిష్కరించలేని అత్యంత సంక్లిష్టమైన లెక్కలను క్వాంటమ్ కంప్యూటర్లు క్షణాల వ్యవధిలో పూర్తి చేయగలవు. డ్రగ్ డిస్కవరీ, వాతావరణ మార్పుల అంచనా, ఎన్‌క్రిప్షన్, ఏరోస్పేస్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలను వేగవంతం చేయడానికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఏర్పాటవుతున్న నూతన జీసీసీలలో హైదరాబాద్ వాటా గణనీయంగా పెరుగుతోంది.













Click it and Unblock the Notifications
