మాజీ రౌడీషీటర్ చేతిలో వరంగల్.. మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు!
మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గంలో ఆమెపైన అసమ్మతి ఆగడం లేదు. నిన్న మొన్నటి దాకా కొండా సురేఖ వర్గంగా తిరిగిన నేతలు సురేఖ వైఖరి పైన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వరంగల్ ఒక రౌడీషీటర్ చేతిలోకి వెళ్లిందని మంత్రి కొండా సురేఖ తన చర్యలతో పార్టీ పరువును దిగజారుస్తున్నారు అని మండిపడుతున్నారు.
సురేఖ వర్సెస్ లోకల్ లీడర్స్
తాజాగా వరంగల్లో పర్యటిస్తున్న కొండ సురేఖ తనను వదిలి వెళ్ళిన ప్రధాన అనుచరులను ఉద్దేశించి చిల్లర గాళ్ళు అని చేసిన వ్యాఖ్యలతో వారంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ సురేఖ చర్యలను తూర్పార పట్టారు. మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ సీనియర్లు స్పందించారు. పిసిసి సభ్యుడు నల్గొండ రమేష్ 40 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న మా గురించి కొండ సురేఖ మాట్లాడడం ఖండిస్తున్నామన్నారు.

పార్టీలు మారింది కొండా సురేఖ తాము కాదన్న సీనియర్లు
చిల్లర గాళ్ళంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సీనియర్ల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అన్నారు. వైఎస్ఆర్సిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది కొండా సురేఖ అని తాము కాదని స్పష్టం చేశారు. పార్టీ పరువును బజారుకీడుస్తూ చిల్లర పనులు చేసింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారని సురేఖను టార్గెట్ చేశారు. శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించింది తామేనని మర్చిపోవద్దు అన్నారు .
మాజీ రౌడీ షీటర్ చేతిలో వరంగల్ తూర్పు
ఎన్ని పార్టీలు మారి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన ఘనత తమదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కార్పొరేటర్లు నియోజకవర్గ ఎమ్మెల్యే ని కలవాలంటే ఒక అడ్రస్ లేని అనామకుడి అనుమతి తీసుకోవాలని, అట్లాంటి పరిస్థితి కొండా సురేఖ దగ్గర ఉందన్నారు. ఓ మాజీ రౌడీ షీటర్ చేతిలో వరంగల్ తూర్పును పెట్టి కొండా సురేఖ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
సురేఖ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్
స్వపక్షం ప్రతిపక్షం లేకుండా అక్రమ కేసులు పెట్టిన ఘనత కొండా సురేఖదని విమర్శించారు. పార్టీలో కార్యకర్త హోదా లేని వ్యక్తి దగ్గరికి కార్పొరేటర్లు నాయకులు వెళ్లేలా చిల్లర వేషం వేసింది మీరేనని తూర్పార పట్టారు. సీనియర్లను చిల్లరగాళ్ళు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక తాజా పరిణామాలతో వరంగల్ తూర్పున రాజకీయం రసకందాయంలో పడింది.
తూర్పులో కొనసాగుతున్న రగడ
గత మూడు రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్న కొండ సురేఖ ఇన్నాళ్లు తన వర్గంగా ఉండి, ఇప్పుడు బస్వరాజు సారయ్య వర్గంలో చేరిన వారిపైన నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వారు కూడా తగ్గేది లేదంటూ దీటుగా బదులిస్తున్నారు. మరి ఈ రగడ ముందు ముందు ఏ స్థాయికి చేరుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications