మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం టార్గెట్ రేవంత్ రెడ్డి కొనసాగుతుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి వంటి ముఖ్య నేతలు బలాన్ని చేకూరుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను ప్రధాన అస్త్రంగా తీసుకొని పోరాటం మొదలుపెట్టింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ను తీసి వేస్తారని, కేవలం మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తారని, రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది.

బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైతుల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక తాజాగా మరో ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.
వ్యవ'సాయం' అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు అంటూ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్ లలో సేద తీరడం కాదని పేర్కొన్నారు. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు అంటూ మంత్రి కేటీఆర్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యవసాయం అంటే అది మట్టి మనసుల పరిమళమని, మట్టి మనుషుల ప్రేమ అంటూ పేర్కొన్నారు.
ఎడ్లు వడ్లు అని ప్రాస కోసం పాకులాడే గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ కు రైతుల పైన అంత ప్రేమ లేదని, వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తి అన్నచందంగా రేవంత్ రెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి రాహుల్ గాంధీ రైతులతో కలిసి వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ తో దున్నుతున్న ఫోటోలు, నాట్లు వేస్తున్న ఫోటోలు రైతులతో మాట్లాడుతున్న ఫోటోలను ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications