రేవంత్ తో పాటుగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీరే..!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటుగా ఇతర పార్టీల ప్రముఖులను ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కార్యకర్తల సమక్షం లో రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటంతో పాటుగా ఆరు గ్యారెంటీల అమలు పైన తొలి సంతకం చేయునన్నారు. ఇక..రేవంత్ తో పాటుగా ప్రమాణం చేసే మంత్రుల జాబితా సిద్దమైంది. అయితే, ఇక్కడే హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది.
రేవంత్ ప్రమాణ స్వీకారం : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్నాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాహుల్ రాక ఇప్పటికే ఖరారు కాగా, సోనియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అగ్ర నాయకత్వం.. ముఖ్య నేతలు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులను..సినీ సెలబ్రెటీలను ఆహ్వనిస్తున్నారు.

రేవంత్ ప్రమాణ స్వీకారం వేళ మిగిలిన మంత్రులు ప్రమాణం చేస్తారని భావించారు. అయితే, సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు..ప్రాధాన్యతల పైన ఇప్పటికీ హైకమండ్ పైన ఒత్తిడి తెస్తున్నారు. సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా మంత్రివర్గ కూర్పు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దీంతో..పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా.. రేవంత్ సీఎంగా.. మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆరుగురు మంత్రులుగా : తెలంగాణలో కొత్త మంత్రివర్గం పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. రేవంత్ సీఎం కావటంతో ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ పదవి మరొకరికి ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో స్పీకర్ ఎంపిక సైతం కీలకంగా ఉంది. ప్రతిపక్షం బలంగా ఉండటంతో స్పీకర్ పదవికి ఎంపిక పైన ఆచి తేచి వ్యవహరిస్తున్నారు.
ఇక..రేవంత్ తో పాటుగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లుకు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క, మాదిగ వర్గం నుంచి దామోదర రాజనర్సింహ, ఎస్టీ వర్గం నుంచి మహిళకు ఇచ్చేలా సీతక్క, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఆరుగురు ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే వారం మరోసారి : భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఖరారైంది. మంత్రి పదవుల కోసం ఢిల్లీ అగ్రనాయకత్వం నుంచి పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. జీ వినోద్ నేరుగా సోనియాను కలిసి మంత్రి పదవి కోరారు. ఈ రాత్రి లోగా కసరత్తు పూర్తయితే పూర్తి స్థాయి మంత్రివర్గం పూర్తవుతుందని చెబుతున్నారు. అయితే, కసరత్తు పూర్తి కాకుంటే ఈ ఆరుగురుతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.
ఈ నెల 9న సీఎం హోదాలో రేవంత్ తొలిసారి ఢిల్లీకి రానున్నారు. ఆ రోజు సోనియాను కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పనున్నారు. అదే రోజున స్పీకర్..మిగిలిన మంత్రుల ఎంపిక..శాఖల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి...కేబినెట్ భేటీ..నూతన అసెంబ్లీ సమావేశాల దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications