రేవంత్ కు సోనియా బిగ్ టాస్క్ - ఆ హామీతోనే సీఎం పదవి, సమర్ధతకు పరీక్ష...!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీనియర్లను కాదని రేవంత్ కు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్టం కట్టింది. ఈ నిర్ణయం వెనుక భారీ కసరత్తు జరిగింది. కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణలో తమ అసలు లక్ష్యం ఏంటనేది స్పష్టం చేసింది. సోనియా అంచనాలను నిజం చేస్తానని రేవంత్ మాట ఇచ్చారు. ఆ హామీయే ఇప్పుడు సీఎం పదవి దక్కటంలో కీలకమైంది. ఇప్పుడు అదే రేవంత్ సమర్ధతకు పరీక్షగా నిలుస్తోంది.
కాంగ్రెస్ బిగ్ టాస్క్:తెలంగాణ ఇచ్చినా పదేళ్లు కాంగ్రెస్ అధికారం దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎం ఎంపిక వెనుక కాంగ్రెస్ భారీ కసరత్తు చేసింది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా..బీజేపీ, బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయటం లేదు. పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలు విషయంలో కర్ణాటకలో పార్టీ నాయకత్వం సమస్యలు ఎదుర్కంటోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల పైన ఆ రాష్ట్రంలో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మూడింట కాంగ్రెస్ ఓడింది. తెలంగాణలో అధికారం దక్కినా..కాంగ్రెస్ అసలు లక్ష్యం వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించటం. ఇప్పుడు రేవంత్ కు ఇదే సోనియా, రాహుల్ టాస్క్ అప్పగించారు.

రేవంత్ సమర్ధతకు పరీక్ష:రేవంత్ సైతం తన మీద నమ్మకం ఉంచాలని..అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే..లోక్ సభ ఎన్నికల్లోనూ పార్టీ మెజార్టీ కొనసాగుతుందని హామీ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. దీంతో..బీజేపీ, బీఆర్ఎస్ ఢీ కొట్టి వారిని ఓడించటం కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. దీంతో, రేవంత్ పైన నమ్మకం ఉంచారు. సీనియర్ల అభ్యంతరాలను పక్కన పెట్టి రేవంత్ పైన నమ్మకంతో పదవి కట్టబెట్టారు. అదే సమయంలో తెలంగాణ ఆర్దిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. గ్యారంటీల అమలు ఆషామాషీ వ్యవహారం కాదు. వీటి అమలుకు దాదాపు రూ లక్ష కోట్లు అవసరమవతాయని అంచనా. జీతాలకే ఇబ్బంది పడుతున్న సమయంలో ఇంత భారీ మొత్తంలో నిధుల సమీకరణ రేవంత్ కు మరో ప్రధాన సమస్యగా మారనుంది.
టార్గెట్ ఫిక్స్:ఈ గ్యారంటీల అమలు..సీనియర్లను కలుపుకుపోవటం..ప్రతిపక్షాలను ఎదుర్కోవటం..వంద రోజుల్లోగా అన్ని హామీలను పట్టాలెక్కించటం రేవంత్ ముందున్న ప్రధాన సవాళ్లు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఆదరణ లభించలేదు. తెలంగాణ పాలన..భవిష్యత్ కు హైదరాబాద్ కీలకం. ఇటు మెజార్టీ కంటే కేవలం నాలుగు సీట్లు మాత్రమే కాంగ్రెస్ కు అధికంగా ఉన్నాయి. అటు ప్రతిపక్షాలు పొంచి ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలకు నాలుగు నెలలే సమయం ఉంది. దీంతో..హైకమాండ్ టాస్క్ పూర్తి చేయటానికి..రేవంత్ తన ముందున్న సవాళ్లను ఎలా అధిగమిస్తారు..తన సమర్ధతను ఎలాంటి వ్యూహాలతో నిరూపించుకుంటారనేది ఇప్పుడు కాంగ్రెస్ తో పాటుగా ప్రతిపక్షాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.












Click it and Unblock the Notifications