శాడిస్ట్ భర్త.. కొడుకు ముందే భార్యను వివస్త్రగా.. చిత్రహింసలు పెడుతూ వీడియో షూట్..
హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఓ శాడిస్ట్ భర్త వ్యవహారం వెలుగుచూసింది. భార్యపై ఇనుపరాడ్డుతో దాడి చేసిన ఓ భర్త.. వీపుపై ఇనుప కడ్డీతో ఆమెకు వాతలు పెట్టాడు. భార్యను కొడుతూ కొడుకుతో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. వద్దని ఎంత వేడుకున్నా అతని మనసు కరగలేదు. చిత్రహింసలకు విలవిల్లాడిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వనపర్తి నుంచి హైదరాబాద్‌కు
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన పానుగంటి శ్రీను, వనపర్తి పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన మంజులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి తర్వాత చాలా ఏళ్లు వనపర్తిలోనే ఉన్న ఈ దంపతులు.. కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని నార్సింగికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు.

కొడుకు ముందే వివస్త్రను చేసి..
హైదరాబాద్ వచ్చిన కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నప్పటికీ.. ఇటీవల మంజులపై శ్రీను అనుమానం పెంచుకున్నాడు. అనుమానం రోజురోజుకు ముదరడంతో.. నిత్యం ఆమెతో గొడవపడేవాడు. ఇష్టమొచ్చినట్టు చితకబాదేవాడు. గత రెండు రోజులుగా అతని చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. మంజుల తలపై ఇనుప రాడ్డుతో కొట్టడంతో మాడు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. అక్కడితో ఆగక.. ఆమెను వివస్త్రను చేసి మైనర్ కొడుకుతో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలతో వీపుపై వాతలు పెట్టాడు.

వనపర్తి పోలీసులకు ఫిర్యాదు..
శాడిస్ట్ భర్త నుంచి తప్పించుకున్న బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని వనపర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసులు ఆమెను చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియోలు చూసి షాక్ తిన్నారు. ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

రాంనగర్‌లో మరో ఘటన
72 ఏళ్ల వయసులో భార్యను చిత్రహింసలు పెడుతున్న మరో ఘటన హైదరాబాద్‌లోని రాంనగర్‌లో వెలుగుచూసింది. స్థానిక గణేశ్ నగర్‌లో నివాసం ఉండే గంగాధర్ అనే వ్యక్తి.. 8 నెలలుగా తన భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. ఇటీవల తన భార్యను ఇంట్లోనే బంధించి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో ఆమె కేకలు విని స్థానికులు స్పందించారు. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు బద్దలు కొట్టి ఆ వృద్దురాలిని బయటకు తీసుకొచ్చారు. వృద్దాప్యంలో భార్యను ఇలా చిత్రహింసలకు గురిచేస్తున్న ఆ వృద్ద భర్త గురించి తెలిసి స్థానికులు షాక్ తిన్నారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications