లిక్కర్ షాప్ లకు గేట్లెత్తిన తెలంగాణ సర్కార్..: తాగేటోడికి తాగినంత
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కేటాయింపులు 2025-27 లైసెన్స్ కాలానికి వర్తిస్తాయి. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. 2027 నవంబర్ 30వ తేదీ వరకు అమలు ఉంటాయి.
ఈ మేరకు రెవెన్యూ మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. లాటరీ విధానంలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుంది. దీనితో పాటు ఎక్సైజ్ పన్నులను కూడా ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంటుంది. రెవెన్యూ (ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలి ముర్తాజా రిజ్వీ.. ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం- వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుము మూడు లక్షల రూపాయలు. ప్రస్తుతం ఈ మొత్తం రెండు లక్షల రూపాయలుగా ఉంది. దీన్ని భారీగా పెంచింది ప్రభుత్వం. ఈ మొత్తాన్ని చెల్లించి- ఒకొక్కరు ఒకటికి మించి దరఖాస్తులను దాఖలు చేసుకోవచ్చు.
దుకాణాల కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించింది. మొత్తం దుకాణాలలో 15 శాతం గౌడ సామాజిక వర్గానికి కేటాయించింది. షెడ్యూల్డ్ కులాలవారికి 10, షెడ్యూల్డ్ తెగలకు అయిదు శాతం మేర మద్యం షాపులు రిజర్వ్ అయ్యాయి. ఆయా సామాజిక వర్గాల వార మాత్రమే దరఖాస్తు దాఖలు చేయడానికి అర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
దుకాణాల సంఖ్య.. ఆయా జిల్లాలో జానాభా నిష్పత్తికి అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 2023- 25 స్లాబ్‌ల ప్రకారమే రిటైల్ షాప్ ఎక్సైజ్ పన్ను ఖరారైంది. వచ్చే 2025-27 లైసెన్స్ కాలానికి కూడా ఇదే రిటైల్ షాప్ ఎక్సైజ్ పన్ను కొనసాగుతుంది. 2011 నాటి జనాభా లెక్కలను దీనికి ప్రాతిపదికన తీసుకుంది ప్రభుత్వం.
- 5,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాలలో సంవత్సరానికి 50 లక్షల రూపాయల మొత్తాన్ని రిటైల్ షాప్ ఎక్సైజ్ పన్నుగా నిర్ధారించింది.
- 5,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాలలో సంవత్సరానికి 55 లక్షల రూపాయలు
- 50,000 నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాలలో సంవత్సరానికి 60 లక్షల రూపాయలు
- లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలల్లో సంవత్సరానికి 65 లక్షల రూపాయలు
- అయిదు లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలలో సంవత్సరానికి 85 లక్షల రూపాయలు
- 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలల్లో 1.10 కోట్ల వరకు రిటైల్ షాప్ ఎక్సైజ్ పన్ను ఉంటుంది.
అదనంగా, ఒక్కో దుకాణానికి సంవత్సరానికి అయిదు లక్షల రూపాయల ప్రత్యేక రిటైల్ ఎక్సైజ్ పన్ను వర్తిస్తుంది. లైసెన్సుదారులు ఈ మొత్తాన్ని ప్రతి సంవత్సరం ఆరు సమాన వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వార్షిక పన్నులో 25 శాతం సమానమైన బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది.
వ్యాపార సమయాల్లో ఎటువంటి మార్పు లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దాని పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుండి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఇతర ప్రాంతాలలో ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు.. ఈ షాపులు తెరిచి ఉంటాయి.
వాక్-ఇన్ స్టోర్లకు సంవత్సరానికి అదనంగా అయిదు లక్షల రూపాయల రుసుముతో ప్రత్యేకంగా అనుమతులు లభిస్తాయి. మద్యం బాటిళ్లపై ముద్రించిన రిటైల్ ధరలకే వాటిని దుకాణదారులు విక్రయించాల్సి ఉంటుంది. సాధారణ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కు 27 శాతం, ప్రీమియం ఐఎంఎఫ్ఎల్, ఫారిన్ లిక్కర్ కు 20 శాతం, బీరుకు 20 శాతం లాభాల మార్జిన్లను ప్రభుత్వం నిర్ధారించింది.
పారదర్శకత, భద్రత పర్యవేక్షణ కోసం.. అన్ని దుకాణాలు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. లైసెన్సుదారులు తమ మద్యం దుకాణాల వద్ద పరిశుభ్ర వాతావరణాన్ని సరైన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications