శ్రీ కృష్ణాష్టమి వేడుకంతా ఇస్కాన్ ఆలయంలోనే.. అంతా కృష్ణ లీల!
జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన నల్లనయ్య జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇక కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో కృష్ణాష్టమి వేడుకలు
కృషుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చక్కని అలంకరణలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకృషుడి వేషధారణలో చిన్నారులు ఆకట్టుకుంటున్నారు. సాయంత్రం వాడవాడలా ఉట్టి కొట్టేందుకు యువత సిద్ధం అవుతున్నారు. మహిళలు చిన్ని కృష్ణుడి పాదాలను ఇళ్ళ ముందు వేసి ఆ క్రిష్ణయ్యను ఇళ్ళలోకి ఆహ్వానిస్తున్నారు. తమ భక్తిని చాటుకుంటున్నారు. చిన్ని క్రిష్ణయ్యల, బుజ్జి గోపికమ్మల సందడి తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది.

వరంగల్ ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి పండుగ
శ్రీకృష్ణాష్టమి వేడుకలు వాడ వాడగా వాడ వాడలా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ఇస్కాన్ ఆలయంలో నేడు అత్యంత వైభవంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణాష్టమి.. కృష్ణుడి జన్మదినం సందర్భంగా నేడు ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. నేడు వేల సంఖ్యలో భక్తులు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవడానికి ఆలయంలో బారులు తీరారు.

భక్తి పారవశ్యంలో కృష్ణ భక్తులు
మధుర, ఉడిపి, ద్వారక తదితర ప్రముఖ ఆలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంత ఘనంగా నిర్వహిస్తారో, అంతే ఘనంగా వరంగల్లోని ఇస్కాన్ ఆలయంలో కూడా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. ఈరోజు ఆలయ ప్రాంగణమంతా శ్రీకృష్ణుని నామంతో మారుమోగింది. హరే రామ హరే కృష్ణ అంటూ భక్తజనులు కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా విశేష పూజలు
ఇస్కాన్ ఆలయంలో భారీగా భక్తులు వస్తున్న క్రమంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుండి శ్రీకృష్ణ భగవానుడికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల 30 నిమిషాలకు మంగళహారతి తో మొదలై, జపం, శ్రీమద్భాగవత ప్రవచనం జరిగాయి. ఇక ప్రసాదం హాల్లో జప యజ్ఞం, గీతా పారాయణం, విష్ణు సహస్రనామం, కృష్ణ పుస్తక పఠనం, కృష్ణ లీల ఫోటో క్విజ్ నిర్వహించారు.

చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, సాంస్కృతిక కార్యక్రమాలు
ఆపై గోవింద నామాలు , జప యజ్ఞం నిర్వహించగా, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగంతా ఇస్కాన్ ఆలయంలోనే ఉన్నట్టుగా కనిపించింది . ఆపై గీత రచన సంకల్పం సర్టిఫికెట్ల పంపిణీ, పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అనంతరం శ్లోక డ్రాయింగ్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ లో గెలిచిన వారికి బహుమతుల పంపిణీ , సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనం ఇలా రాత్రి వరకు కార్యక్రమాలతో ఇస్కాన్ ఆలయం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

ఉదయం నుండి కొనసాగుతున్న మహాభిషేకం
ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఆలయ హాలులో మహా అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించే వివిధ కార్యక్రమాలతో కన్నయ్య పుట్టినరోజు వేడుకంతా ఇస్కాన్ ఆలయంలోనే కనిపిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు అత్యంత భక్తిపారవశ్యంతో కృష్ణ పరమాత్మ ని దర్శించుకుని తరిస్తున్నారు.












Click it and Unblock the Notifications