ఇకపై తెలంగాణలో వాహనాలకు ఇవి తప్పనిసరి- టూవీలర్లు, సెవెన్ సీటర్లు సైతం: కొత్త గైడ్ లైన్స్
రాత్రివేళ రహదారి భద్రతను పెంపొందించడానికి, వాహనాల విజిబిలిటీని మరింత మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 2024లో తెలంగాణలో 25,986 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 7,949 మంది మరణించగా, 23,658 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల సంఖ్యలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అలాగే మరణాల సంఖ్యలో 10వ స్థానంలో నిలిచింది.
దీన్ని నివారించడానికి తాజాగా కఠిన మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ విజిబిలిటీ ఉన్న పరిస్థితుల్లో నిలిపి ఉంచిన/ నెమ్మదిగా కదులుతున్న వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటిని ఖచ్చితంగా వాహనదారులు పాటించాల్సి ఉంటుంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం- ఏఐఎస్ 057, 090, 089 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలకు రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్‌లను అమర్చడం తప్పనిసరి. ఈ నిబంధనలు టూవీలర్లు, ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లతో అన్ని రకాల త్రీ వీలర్లు, గూడ్స్ వాహనాలు, సెవెన్ సీటర్లు, కమర్షియల్ వాణిజ్య క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, 8+ సీట్లు ఉన్న ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు వర్తిస్తాయి.
ట్రాక్టర్లు, ట్రైలర్లు, పవర్ టిల్లర్లు, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన వాహనాలు, మాడ్యులర్ హైడ్రాలిక్ ట్రైలర్లు కూడా ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనలను పాటించని పక్షంలో వాహన రిజిస్ట్రేషన్ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయరు. ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఆర్టీఓ అధికారులు నిర్ద్వందంగా నిరాకరిస్తారు.
నకిలీ లేదా నాసిరకం రిఫ్లెక్టివ్ టేప్స్ లేదా దాని సంబంధిత వస్తువుల వినియోగాన్ని అడ్డుకోవడానికి రవాణా శాఖ క్యూఆర్ కోడ్ ను ప్రవేశపెట్టింది. క్యూఆర్ కోడ్ ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను అమలు చేయనుంది. ఈ వ్యవస్థ ద్వారా రిజిస్టర్డ్ రిఫ్లెక్టివ్ టేపులు, వాహనాల వెనుక మార్కింగ్ ప్లేట్లను తప్పనిసరిగా అమర్చాలి. అలాంటి వాహనాలక మాత్రమే రిజిస్ట్రేషన్ లేదా ఫిట్ నెస్ రెన్యూవల్ కు అనుమతి ఇస్తారు.
ఫ్యాక్టరీ నుండి అమర్చిన టేపులతో కూడిన పూర్తిగా నిర్మితమైన వాహనాలకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ లోని 126 నిబంధన ప్రకారం టెస్టింగ్ ఏజెన్సీలు ఆమోదించిన తయారీదారులను రవాణా కమిషనర్ ఖరారు చేస్తారు. విదేశాల్లో తయారైన టేప్ లను వినియోగించడానికీ కొన్ని నిబంధనలు విధించారు. అలాగే- వీటిని వినియోగించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
రిజిస్ట్రేషన్/ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లను రెన్యూవల్ చేయడానికి ముందు ఈ క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. లిస్టెడ్ కంపెనీలు తయారు చేసిన క్యూఆర్ కోడ్ లను మాత్రమే వాహనదారులు వినియోగించాల్సి ఉంటుంది. QR కోడ్‌తో కూడిన నిర్దేశిత ఫార్మాట్‌లో జారీ చేసిన ఇన్‌స్టాలేషన్ సర్టిఫికేట్‌లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సంబంధిత మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి.. అవి నకిలీవి కావని నిర్ధారించిన తర్వాతే రిజిస్ట్రేషన్/ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లను రెన్యూవల్ చేస్తారు.
ఏఐఎస్ 090 లేదా ఏఐఎస్ 089 ప్రమాణాలను ఉల్లంఘించి రిఫ్లెక్టివ్ టేపులు, వెనుక మార్కింగ్ ప్లేట్‌లను ఉత్పత్తి చేసిన లేదా నకిలీ టేపులను సరఫరా చేసిన తయారీదారుల బ్యాంక్ గ్యారంటీ మొత్తాన్ని అధికారులు జప్తు చేస్తారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.












Click it and Unblock the Notifications