తెలంగాణలో నియామకాలు: రాజయ్యకు కీలక పదవి: టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది. గేరు మార్చింది.

పార్టీలో అసంతృప్తిని చల్లార్చడంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కని నేతలను ఛైర్మన్ స్థానాల్లో కూర్చోబెట్టింది. వారికి కీలక బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సహా వివిధ కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను ప్రకటించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రైతుబంధు సమితి ఛైర్మన్‌గా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియమించింది. ఆయనకు ఈ దఫా టికెట్ దక్కలేదు. ఈ స్థానాన్ని కడియం శ్రీహరికి కేటాయించారు కేసీఆర్.
ఇక టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి అప్పగించారు. ముత్తిరెడ్డికి కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయన జనగామ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ దఫా ఆ స్థానాన్ని ఆయనకు లభించడం కష్టమే. కొత్త అభ్యర్థిని రేసులో నిలపనున్నారు కేసీఆర్.

అందుకే టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ స్థానాన్ని ముత్తిరెడ్డికి ఇచ్చారు. ప్రస్తుతం అక్కడున్న బాజిరెడ్డి గోవర్ధన్‌ను తప్పించారు. అలాగే- నందికంటి శ్రీధర్‌కు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కేసీఆర్ నియమించారు. ఇదివరకు మైనంపల్లి హన్మంతరావు ఈ స్థానంలో కొనసాగారు. ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి జాయిన్ అయ్యారు నందికంటి శ్రీధర్. ఆయనకు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్‌గా ఉప్పల వెంకటేష్‌ను నియమించారు. ఈ మేరకు అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications