రేవంత్ కు మద్దతుగా బరిలోకి టీడీపీ- సోషల్ మీడియాలో హోరు..!
హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప2 చిత్రం విడుదల సందర్భంగా హీరో అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి, ఆమె కుమారుడు అపస్మారక స్ధితిలోకి వెళ్లడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయి హీరో అల్లు అర్జున్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. దీంతో జైలుకు కూడా వెళ్లిన అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగుతోంది.
నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అనంతరం సాయంత్రానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వీటిలో రేవంత్ రెడ్డికి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రేవంత్ కు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీ నేతలు, సానుభూతి పరులు, చివరికి జర్నలిస్టులు కూడా పోస్టులు పెడుతున్నారు.

సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు కావడంతో మెగా కుటుంబం ఆయనకు అండగా నిలిచింది. అల్లు వారికి ఇంటికి వెళ్లి పరామర్శలు కూడా చేసింది. అయితే దీంతో మెగా కుటుంబానికీ, అల్లు కుటుంబానికీ మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోలేదు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో రేవంత్ కామెంట్స్ తర్వాత అల్లు అర్జున్ ఇచ్చిన వివరణకు కౌంటర్ గా టీడీపీ నుంచి భారీ ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications