కేటీఆర్ పేరుతో ఉన్న టీ స్టాల్ క్లోజ్.. రియాక్ట్ అయిన కేటీఆర్..!
తెలంగాణలో ఓ కలెక్టర్....తానొక ప్రభుత్వ సర్వెంట్ అనే విషయం మరిచి రాజకీయ నాయకుడిలా ప్రవర్తించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సిరిసిల్లలో ఓ చిన్న టీ స్టాల్ పై ఆ జిల్లా కలెక్టర్ తన ప్రతాపం చూపించారు. ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో... ఆ షాపుపై మున్సిపల్ అధికారుల చేత దాడి చేయించి మూసి వేయించారు. దీనిపై కేటీఆర్ సైతం స్పందించి అధికారులపై ఫైరయ్యారు. అసలేం జరిగింది? టీ స్టాల్ కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు రియాక్టయ్యారు?
సిరిసిల్ల నియోజకవర్గంలో బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగేళ్లుగా బతుకమ్మ ఘాట్ వద్ద 'కేటీఆర్ టీ స్టాల్' పేరుతో టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. కేటీఆర్ పై అభిమానంకో స్టాల్ పై బోర్డుపై కేటీఆర్ ఫొటోను కూడా పెట్టుకున్నాడు. అయితే ఈ టీ దుకాణాన్ని మున్సిపల్ అధికారులు దాడి చేసి మూసివేయించారు. ఇదేంటని ప్రశ్నిస్తే....కలెక్టరే ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేదని మూసివేయమన్నారని అధికారులు చెబుతున్నారు. కానీ తన స్టాల్ పై కేటీఆర్ పేరు, ఫొటో పెట్టుకున్నందుకే దుకాణాన్ని మూసివేయించారని బాధితుడు శ్రీనివాస్ ఆరోపిస్తున్నాడు. అయితే, ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం వల్లే దుకాణాన్ని మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు.

కలెక్టర్ కావాలనే కక్ష గట్టి తన టీస్టాల్ బలవంతంగా మూసివేయించాడని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల మున్సిపల్ అధికారులు టీ స్టాల్ వద్దకు వచ్చి కేటీఆర్ ఫొటో తొలగించాలని చెప్పారన్నారు. టీస్టాల్ లేకపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం కేటీఆర్ ఫొటో తొలగించబోనని చెప్పడంతో కలెక్టర్ ఆ కోపంతో తన టీ స్టాల్ ను బలవంతంగా మూసివేయించారని ఆరోపిస్తున్నారు. సిరిసిల్లలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదంటూ శ్రీనివాస్ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు వివరణ ఇస్తూ...టీ స్టాల్ కు ట్రేడ్ లైసెన్స్ లేదని చెపుతున్నారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్నందుకే టీ స్టాల్ ను మూసివేయించామని వివరించారు.
అయితే ఈ ఘటనపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ x వేదికగా స్పందించారు. తన పేరుతో పాటు ఫొటో పెట్టుకున్నందుకు ఒక టీ స్టాల్‌ను మూసివేయించారంటూ అధికారులపై భగ్గుమన్నారు. ప్రతి విషయాన్ని గుర్తు గుర్తుంచుకుంటున్నా, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను మాట మీద ఉంటానని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications