హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు: సీఎస్ అలర్ట్
హైదరాబాద్: రాజధాని నగరంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా వర్షాలపై సీనియర్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతి కుమారి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Recommended Video

కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ప్రాణనష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించాలన్నారు.

పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. కలెక్టరేట్లు, మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కాగా, రాష్ట్రంలో రానున్న నాలుగైదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయని వెల్లడించింది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, ఇప్పటికే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా రోజుల ఎదురుచూపు తర్వాత భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలం పనుల్లో నిమగ్నమవుతున్నారు.












Click it and Unblock the Notifications