జెన్‌కో, ట్రాన్స్‌కో ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం భట్టి చెప్పిందిదే!
తెలంగాణలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కామ్‌లను ప్రైవేటీకరిస్తున్నారని వస్తున్న వార్తలపై డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. ఇలాంటి ఆలోచనే లేదని, పబ్లిక్ సెక్టార్ సంస్థలను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఆయన తేల్చి చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని భట్టి విక్రమార్క వివరించారు.
పీక్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరినా ఎక్కడా పవర్ కట్స్ లేకుండా నిరంతర సరఫరా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇది తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ అని గుర్తు చేశారు. కర్ణాటకలో 15 వేల మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 13 వేల మెగావాట్లు ఉండగా, తెలంగాణలో 20 వేల మెగావాట్లకు దగ్గరగా ఉండటం గమనార్హమని, అత్యధిక విద్యుత్ డిమాండ్ ఇక్కడే ఉందన్నారు.

ఈ భారీ డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించిన జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కామ్ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం విద్యుత్ రంగంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలను లిస్టెడ్ కంపెనీలుగా మార్చే ప్రతిపాదన కూడా లేదని స్పష్టం చేశారు. నెహ్రూ ఆర్థిక విధానాలపై తమకు విశ్వాసం ఉందని, మిక్స్‌డ్ ఎకానమీ, బలమైన పబ్లిక్ సెక్టార్ సంస్థలే కాంగ్రెస్ విధానమని అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూడా ఎత్తిచూపారు. 2015లోనే ఎల్‌ఓఐ ఇచ్చినా, బొగ్గు కేటాయింపుల్లో నిర్లక్ష్యం జరిగిందని చెప్పారు. 2016లో సింగరేణి నుంచి 'జీ9' గ్రేడ్ బొగ్గు ఇస్తామని ఒప్పందం చేసుకున్నా, అప్పట్లో అలాంటి నిల్వలు ఉన్నాయా అని ప్రశ్నించారు. నైనీ బ్లాక్ మైనింగ్ నిలిచిపోయినప్పుడు తాము వెళ్లి ఒప్పించి పనులు ప్రారంభించామన్నారు. గతేడాది రెండు యూనిట్లు, ఈ ఏడాది మరో రెండు యూనిట్లు ప్రారంభించామని తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్ రావు యాదాద్రి విషయంలో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. గత ప్రభుత్వ తప్పులను ఆధారాలతో సహా వారానికి ఒకటి చొప్పున బయటపెడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. తెలంగాణలో విద్యుత్ రంగం స్థిరంగా ఉండటం, పీక్ డిమాండ్‌ను నిర్వహించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
