తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం: చంద్రబాబు ఆసక్తికర సందేశం, మోదీ ఏమన్నారంటే!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ పురోగతికి లెక్కలేనంత కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని అభివర్ణించారు. దశాబ్ద కాలంలో జీవన సౌలభ్యాన్ని పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు విజయం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలని ప్రధాని మోదీ కోరుకున్నారు.

అవతరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు. తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు తెలుగు జాతి ఒక్కటేనని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
తెలుగువారు ఎక్కడున్నా సరే సమున్నతంగా ఎదగాలన్నదే ఆకాంక్ష
తెలుగువారు ఎక్కడున్నా సరే సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని, అదే తన ఆలోచన అని చంద్రబాబు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం, సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు.
తెలుగుజాతి తిరుగులేని శక్తిగా నిలవాలని ఆశ
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్ 2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని తాను ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు తన పోస్టులో వెల్లడించారు. తెలుగుజాతి తిరుగులేని శక్తిగా నిలవాలని, ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని తాను ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు నాయుడు రాసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రాలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు వారమంతా ఒకటేనని చంద్రబాబు తన మనసులోని భావనను మరోమారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications