తెలంగాణ మహిళలకు పండుగవేళ శుభవార్త .. ఉచిత చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ప్రతీ ఏడాది మహిళలకు అందిస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా మరియు పండుగ సమయాల్లో ఇళ్లలో సంతోషం నింపే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2026 సంవత్సరానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 334కోట్ల రూపాయలను కేటాయించింది.
గతంలో పాలపిట్ట రంగు ఉన్న చీరలను ఇవ్వగా ఈసారి చిలకపచ్చ చీరలకు ఎరుపు అంచు ఉన్నవి ఇవ్వనుంది. ఈ చీరల పంపిణీకి ఏప్రిల్ మాసం నుండే సిరిసిల్లతో పాటు మొత్తం 13 కేంద్రాలలో తయారీ చేయించారు. మొత్తం 95 లక్షల మందికి పంపిణీ చేయటం లక్ష్యం కాగా, ఇప్పటికి 65 లక్షల చీరలు సిద్ధం అయ్యాయి. వీటిని ఇప్పటికే జిల్లాలకు చేర్చారు. ఇందిరా గాంధీ జయంతి నాడు పంపిణీ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న రేషన్ దారులకు ఈ చీరలను పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలందరికీ ఈ కానుకను అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక పథకం ద్వారా కేవలం మహిళల సంక్షేమమే కాకుండా, రాష్ట్రంలోని చేనేత రంగానికి కూడా ఎంతో మద్దతు లభిస్తోంది. రాజన్న సిరిసిల్లతో పాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ చేనేత కేంద్రాల్లో ఈ నాణ్యమైన చీరల తయారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
దీనివల్ల స్థానిక చేనేత కార్మికులకు నిలకడైన ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అర్హత కలిగిన ప్రతి మహిళకు ఈ ప్రయోజనం సక్రమంగా అందేలా డిజిటల్ పద్ధతులను పాటిస్తూ పారదర్శకంగా పంపిణీ చేపట్టనున్నారు.
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని అమలు చేస్తున్న ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతగానో దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications
