తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు టీటీడీ గుడ్ న్యూస్-ఇకపై ఇలా..!
తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే.
తెలంగాణ నుంచి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపే సిఫార్సు లేఖల ఆధారంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కేటాయింపుల్లో ఈ మధ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తెలంగాణకు చెందిన అధికార, విపక్ష పార్టీలు కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నాయి. తొలుత ఈ విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విమర్శలపై టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా స్పందించారు. తిరుమలలో వివక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ కూడా ఇవే ఆరోపణలు చేయడంతో టీటీడీ వెనక్కి తగ్గింది.

ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఇందులో వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో టీటీడీ అధికారికంగా దీనిపై ఉత్తర్వులు జారీ చేయబోతోంది. అనంతరం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని స్వీకరించడం ప్రారంభమవుతుంది. అలాగే ఏపీ-తెలంగాణ వివక్ష ఆరోపణలకు చెక్ పెట్టినట్లవుతుంది.












Click it and Unblock the Notifications