సంక్రాంతికి ప్రయాణికులకు తెలంగాణా ఆర్టీసీ శుభవార్త.. ఏపీకి షాక్!
సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ ఊరికి వెళ్లే వారికి శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాలకు వెళ్లి పండుగను విశేషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో సంక్రాంతి పండుగకు తరలి వెళ్తారు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారు పండుగకు కచ్చితంగా వారి సొంత ఊర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు.
సంక్రాంతికి తెలంగాణా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఇక సొంత వాహనాలు ఉన్నవారు మినహాయించి మిగతావారు రైళ్లలోనూ, బస్సులలోను ప్రయాణాలు చేస్తారు, సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ మాత్రమే కాదు ఆర్టీసీ కూడా అదనపు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తుంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు 5000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

పదిరోజుల పాటు నడవనున్న ప్రత్యేక బస్సులు
రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని తెలుస్తుంది. జనవరి మొదటివారం నుంచి పదిరోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని టీజీఎస్ ఆర్టీసీ పేర్కొంది. అయితే సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకబస్సులు ఏ ఏ రూట్లో నడుస్తాయి అనే అంశంపైన త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు టికెట్ రేట్లపైన కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ప్రైవేట్ వాహనాల బాదుడుకు చెక్
హైదరాబాద్ నుండి ఏపీకి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలి వెళ్లే వేళ పది రోజులపాటు వీరి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు వాహనాలు, ప్రైవేటు బస్సుల వారు సంక్రాంతికి చార్జీల బాదుడుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన శుభవార్త ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగిస్తుంది.
పండుగకు తెలంగాణా ఆర్టీసీ ప్లాన్
ఇక ఈ సంవత్సరం ఐదువేల బస్సులను నడపడం తొలిసారి. ఇంత భారీ సంఖ్యలో ఇంతకుముందు ఎప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడపలేదు. ఏపీఎస్ఆర్టీసీకి తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పండుగ వేళా కాస్త దెబ్బ అని చెప్పాలి. ఈ ఫెస్టివల్ ను బాగా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న తెలంగాణ ఆర్టీసీ అదనపు చార్జీలు కూడా ఏవి లేకుండా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా?
అయితే ఈ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే అధికారికంగా పూర్తి సమాచారాన్ని ఇవ్వవలసి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పండుగ వేళ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సులలో వీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
పండుగ వేళ మహిళల ప్రయాణం ఇలా
తెలంగాణకు సంబంధించిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలనుకుంటే మాత్రం తెలంగాణ సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణాన్ని ఏపీలోకి వెళ్లిన దగ్గర నుండి టికెట్ తీసుకుని ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇది సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులకు సూపర్ న్యూస్.












Click it and Unblock the Notifications