మేడారం జాతరలో చేతులెత్తేసిన ఆర్టీసీ.. రీజన్ ఇదే!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. నాలుగు రోజులపాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఇసుకేస్తే రాలనంత జనం మేడారానికి వెళ్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం మేడారం నుండి సమ్మక్క సారలమ్మలు తిరిగి జనం నుండి వనాలకు చేరుకుంటారు. ఇక ఇప్పటికే భారీగా అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణాలు మొదలుపెట్టారు.
చేతులెత్తేసిన ఆర్టీసీ
అయితే మేడారంలో భక్తులకు తగినన్ని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆర్టిసి చేతులెత్తేసింది. సహజంగా మేడారం జాతరకు వాహనాలలో వెళ్లాలంటే అడుగడుగున ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మేడారం జాతరకు ఈసారి వాహనాలలో వెళ్లే కంటే ఆర్టీసీ బస్సులలో వెళ్లడం మంచిదని భావించి ఎక్కువమంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు.

మేడారం జాతరలో ఉన్న భక్తులు ఆర్టీసీపైన తీవ్రఆగ్రహం
నాలుగు వేల బస్సులను ఏర్పాటు చేశామని చెబుతున్న ఆర్టీసీ రద్దీకి తగినట్టుగా సేవలను అందించలేకపోతుంది. ఇక మరోవైపు ట్రాఫిక్ జామ్ లో అనేక బస్సులు ఇరుక్కు పోవడంతో మేడారం జాతరలో ఉన్న భక్తులు ఆర్టీసీపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు సదుపాయాలను కల్పిస్తామని చెప్పిన ఆర్టీసీ, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా ట్రాఫిక్ జామ్..
ఒక్కసారిగా జనమంత తిరుగు ప్రయాణం అవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మేడారం నుంచి పస్రా వరకు ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంతో చాలా బస్సులు ఆ ట్రాఫిక్ జామ్ లోనే ఆగిపోయాయి. దీంతో మేడారంలో ఉన్న భక్తులకు బస్సులకోసం ఎదురు చూడక తప్పడం లేదు. ఇక బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో ఆ ట్రాఫిక్ క్లియర్ అయితే తప్ప అవి సంబంధిత ప్రాంతాలకు చేరుకుని, తిరిగి వెళ్లే పరిస్థితి లేదు.
ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం
దీంతో మేడారం జాతరలో బస్సుల కోసం నిరీక్షిస్తున్న భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జాతర సక్సెస్ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది అన్న చర్చ ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా మేడారం జాతరలో ట్రాఫిక్ నియంత్రణ అన్నిటికంటే ముఖ్యమైన టాస్క్. ఈ టాస్క్ ను నిర్వర్తించడంలో పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయింది అన్నది జరుగుతున్న చర్చ. అయితే ట్రాఫిక్ నియంత్రణలో ఫెయిల్యూర్, ఆర్టీసీకి కూడా ఫెయిల్యూర్ ని తెచ్చిపెట్టింది.












Click it and Unblock the Notifications