2480 కేజీల స్వీట్స్ సీజ్.. బొద్దింకలు, మురుగు మధ్య తయారీ.. చూస్తే జన్మలో తినరు!
హైదరాబాద్ నగరంలోని డెయిరీ కేంద్రాలు, స్వీట్స్ దుకాణాల్లో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కళ్ళు బైర్లుగమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెత్త కుప్పలు, మురుగు నీరు, పాన్-గుట్కా ఉమ్ములు, బీడీలు ఉన్న చోట్లే కోవా, లడ్డూలు తయారవుతున్న దృశ్యాలు కనిపించాయి. బొద్దింకలు, ఈగలు, కీటకాలు సంచరిస్తూ ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు చేసిన జీడిమెట్లలోని బాలాజీ మిఠాయి కేంద్రం, భాగ్యలక్ష్మి డెయిరీ, యశోద డెయిరీ వంటి ప్రదేశాల్లో వంటగదులు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయి. స్లిప్పరీ ఫ్లోరింగ్, కాబ్వెబ్లు, సరైన డ్రైనేజీ లేకపోవడం, సిబ్బంది హెయిర్ నెట్ లేదా ఆప్రాన్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలు ఎదురయ్యాయి. పీర్జాదిగూడలోని జగన్నాథ్ డెయిరీకి నోటీసు జారీ చేశారు.

చీర్యాలలోని మధుర డెయిరీ ప్రొడక్ట్స్, జీడిమెట్ల దేశీ డెయిరీలు లైసెన్సు లేకుండా నడుస్తున్నట్లు తేలడంతో వెంటనే మూసివేయాలని ఆదేశించారు. మొత్తం 2,480 కేజీల కోవా, లడ్డూలు సహా ఇతర పదార్థాలను సీజ్ చేసి ధ్వంసం చేశారు. వీటి విలువ రూ.3.8 లక్షలు. నాసిరకం పాలు వాడుతున్నారని అనుమానంతో ఎనిమిది రకాల నమూనాలను పరీక్షలకు పంపారు.
అదనంగా బస్సులు, డీసీఎం వాహనాల్లో ప్లాస్టిక్ కవర్లలో తరలిస్తున్న 3.6 టన్నుల కోవాను కూడా సీజ్ చేశారు. రిఫ్రిజిరేటెడ్ వాహనాలు లేకుండా రవాణా చేయడం ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. టీజీ సేఫ్ కమిషనర్ అవినాశ్ మహంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మూడు యూనిట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు సస్పెండ్ చేశారు. ఇతర యూనిట్లకు షోకాజ్, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ అయ్యాయి.
ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. వినియోగదారులు గుర్తింపు ఉన్న, శుభ్రమైన దుకాణాల నుంచే స్వీట్స్ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలీకుండానే తియ్యని విషం తింటున్నామని తాజా దాడులతో అర్ధం అవుతుంది, అందుకే బయట ఆహారాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications
