TGSRTC: బస్ పాస్ రేట్ భారీగా తగ్గింపు
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు అందించింది. పర్యావరణహిత ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధరలను భారీగా తగ్గించింది. ఇందులో ప్రయాణించే వారి సౌకర్యార్థం నెలవారీ బస్ పాస్ ధరను సవరించింది. గ్రీన్ మెట్రో బస్ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది వరకు ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో నెలవారీ బస్ పాస్ ధర 2,530 రూపాయలు. తాజాగా ఈ రేట్‌ను తగ్గించింది. 1,900 రూపాయలకే ఈ బస్ పాస్‌ను అందజేస్తోన్నట్లు ప్రకటించింది. 630 రూపాయల మేర తగ్గింపుతో పాటు ఈ పాస్‌తో ఇతర సిటీ బస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసలుబాటును కల్పించింది.

ఇ-మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ పాస్‌తో ప్రయాణించవచ్చు. అలాగే.. సికింద్రాబాద్- పఠాన్ చెరువు, బాచుపల్లి - వేవ్ రాక్ మార్గాల్లో తిరిగే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో కూడా ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. శంషాబాద్ విమానాశ్రయం రూట్‌లో నడిచే పుష్ఫక్ ఏసీ బస్సుల్లో మాత్రం ఈ పాస్ చెల్లుబాటు కాదు.
మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ కలిగిన ప్రయాణికులు 20 రూపాయల కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లు లభిస్తాయని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ సిటీ బస్సులే నడిపేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను టీజీఎస్ఆర్టీసీ రూపొందించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ నాన్ ఏసీ సెమీ లో-ఫ్లోర్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఇవి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది ఒక్కో బస్సు.
ఈ బస్సు పొడవు 12 మీటర్లు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సులో మొబైల్ ఛార్జింగ్, సీటు బెల్ట్ సదుపాయం ఉంటుంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది.












Click it and Unblock the Notifications