పండుగ వేళ డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ షాక్.. ఆ సెలవులు లేనట్టే!
దసరా పండుగ సమయంలో డ్రైవర్ లు, కండక్టర్ లకు ఊహించని షాక్ ఇచ్చింది ఆర్టీసీ. పండుగ వేళ ఉత్సాహంగా డ్యూటీలు చేసే వారికి మింగుడు పడని వార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త నియమాలు తీసుకొచ్చింది. డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్లకు ఇకపై సెలవులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
అక్టోబరు 13న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని ప్రాంతీయ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డబుల్ డ్యూటీ చేసినవారికి నగదుకు బదులు డీఓఎఫ్ డ్యూటీ ఆఫ్, సీఓఎఫ్ కంపెన్సేటరీ ఆఫ్ సెలవులు మంజూరు చేసేవారు. ఇప్పుడు వాటిని పూర్తిగా రద్దు చేసి, కేవలం డబుల్ డ్యూటీ అడ్వాన్స్ మాత్రమే చెల్లించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు షాక్ ఇచ్చింది.

అయితే ఆర్టీసీలో డబుల్ డ్యూటీలు చేసేవారికి సెలవులు ఇవ్వడం వల్ల సిబ్బంది అందుబాటులో ఉండకుండా పోయి షెడ్యూల్ సర్వీసులు ఆటంకపడుతున్నాయని యాజమాన్యం వాదిస్తోంది. డిపోల్లో అన్ని సర్వీసులు సక్రమంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తో సహా పలు యూనియన్లు మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టం-1961 ప్రకారం ఓవర్టైమ్ చెల్లించాలని, అర్హత మేరకు విశ్రాంతి రోజులు ఇవ్వాలని గుర్తు చేశాయి. 16 నుంచి 18 గంటల పాటు నిరంతరం పని చేసే సిబ్బందికి శారీరక విశ్రాంతి అవసరమని, కొద్దిపాటి నగదుతో దాన్ని భర్తీ చేయలేమని వారు అంటున్నారు.
ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉండటంతో అనేక సర్వీసులు రద్దవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత భారం పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఉత్తర్వులు ఉపసంహరించుకుని చట్టబద్ధమైన ప్రయోజనాలు కల్పించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పండుగ వేళ ప్రయాణికులకు సేవలు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, సిబ్బంది ఆరోగ్యం, భద్రతను విస్మరించకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఇలా అయితే డబుల్ డ్యూటీలు చేయటం తమకు కష్టంగా మారుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
