రేషన్ కార్డుదారులకు తెలంగాణా ప్రభుత్వం భారీ శుభవార్త!
రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇకపై రేషన్ తీసుకునే రేషన్ కార్డుదారులు తమకు సంబంధించిన రేషన్ సమాచారం కోసం రేషన్ షాపుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం కోసం వినూత్న డిజిటల్ సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా టీ రేషన్ యాప్ ను ప్రారంభించింది.
రేషన్ సమాచారాన్ని ఇంటి నుండే తెలుసుకునేలా యాప్
ఈ యాప్ ద్వారా రేషన్ కార్డు దారులు గతంలో తమ కార్డులో ఉన్న వివరాలు, తమకు నెలవారి కేటాయించిన బియ్యం వివరాలు తెలుసుకోవచ్చు. నిమిషాలలోనే తమ రేషన్ కార్డుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యాప్ ద్వారా పొందవచ్చు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఈ యాప్ ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. ప్రజలకు తమకు అందే సరుకులపైన స్పష్టమైన అవగాహన కల్పిస్తూ ఈ యాప్ ను రూపొందించింది.

అవకతవకలకు చెక్ పెట్టేలా యాప్
ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి, రేషన్ డీలర్లు జవాబుదారీ తనం తోటి ప్రవర్తించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని భావిస్తుంది. కేవలం రేషన్ డీలర్లు అందించే సమాచారం పైన ఆధారపడకుండా ప్రభుత్వం వారికి ఏమి కేటాయించింది? ఎంత కేటాయించింది? అన్నది నేరుగా చూసుకునే అవకాశాన్ని కల్పిస్తూ పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం. ఈ యాప్ తో అనేక సేవలను కూడా పొందవచ్చునని ప్రకటించింది.
గత ఆరు నెలల్లో తీసుకున్న రేషన్ అన్ని వివరాలు
కుటుంబానికి ప్రతినెల లభించే బియ్యం, గోధుమలు, ఇతర సరుకుల కోటా వివరాలను ముందుగానే తెలుసుకునేలా ఏర్పాట్లు చేసింది. గత ఆరు నెలలలో ఎప్పుడు ఎంత రేషన్ తీసుకున్నారో పూర్తి జాబితా కూడా ఇందులో అందుబాటులో ఉండేలా యాప్ ను రూపొందించింది. రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయి? ఏ ఆధార్ కార్డులు లింక్ అయ్యాయి? ఏవి ఇంకా కాలేదు? అనేది చూడనుంది.
రేషన్ కార్డ్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకునే ఛాన్స్
కేటాయించిన రేషన్ షాప్ నెంబర్, డీలర్ పేరు, షాప్ ఉన్న ప్రదేశం, దానిని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ కూడా ఇందులో లభ్యమవుతాయి. అంతేకాక తమ రేషన్ కార్డ్ యాక్టివ్ గా ఉందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునే అవకాశం కూడా ఉంది. రేషన్ వ్యవస్థలో అవినీతిని అరికట్టడం కోసం ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. డీలర్లు సరుకులు తక్కువగా ఇస్తున్నారన్న ఫిర్యాదులు కూడా తరచుగా వస్తున్న పరిస్థితి ఉంది.
పౌర సేవలను ప్రజలకు చేరువ చేయటం లక్ష్యం
దీంతో ఈ యాప్ ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కు సంబంధించిన సమాచారాన్ని అందించి ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి రేషన్ షాప్ దగ్గరికి పరిగెత్తకుండా, రేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యాప్ లో ఉంటుంది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రేషన్ కార్డుదారులు అందరికీ బాగా ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications