మరో సంక్షేమం.. ఒంటరి మహిళలకు ప్రతీ నెలా రూ.వెయ్యి: కేసీఆర్
ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.1000 జీవనభృతి ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: సంక్షేమ పథకాల ద్వారా వీలైనంత ఎక్కువమందికి లబ్ది చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా స్త్రీ సంక్షేమం కోసం మరో కొత్త నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
రాష్ట్రంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నిరుపేద మహిళలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సీఎం తెలిపారు. ఈ మేరకు ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.1000 జీవనభృతి ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో సుమారు 3లక్షల మంది ఒంటరి మహిళలు ఉన్నారని, వారికి సంబంధించిన సమగ్ర వివరాలను అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించనునన్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ రోజు శాసనసభలో ప్రసంగించిన కేసీఆర్.. ఆ సందర్బంగా ఈ కొత్త నిర్ణయాన్ని వెల్లడించారు.
వచ్చే మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఈ కొత్త నిర్ణయానికి సంబంధించిన నిధులను కేటాయించనున్నట్టుగా సీఎం పేర్కొన్నారు. ఇప్పటిదాకా కేటాయిస్తూ వచ్చిన బడ్జెట్ లో అధికశాతం సంక్షేమ నిధికే కేటాయించామని, పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టామని సీఎం గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications