చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అత్యవసర సమావేశం: బాలయ్య డుమ్మా?
హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసిన భారీ సినిమా పైరసీ రాకెట్‌పై నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో, సినీ పరిశ్రమ పెద్దలతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పైరసీ వల్ల కలిగే నష్టాలు, దాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అక్కినేని నాగార్జున, నాని, నాగచైతన్య, రామ్ పోతినేని, దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపు అందినప్పటికీ.. ఆయన వెళ్లలేదు.

పైరసీ వెబ్‌సైట్‌ల ద్వారా సినిమాలు మాత్రమే కాకుండా, వాటిని సందర్శించిన వారి డేటాను కూడా సైబర్ నేరాలకు, ఆర్థిక మోసాలకు, డిజిటల్ అరెస్టులకు దుర్వినియోగం చేస్తున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సినిమా పైరసీ రెండు ప్రధాన మార్గాలలో జరుగుతోందని పోలీసుల దర్యాప్తులో తేలిందని వివరించారు. ఒకటి- థియేటర్లలో మొబైల్ ఫోన్‌లతో రహస్యంగా రికార్డ్ చేయడం. రెండోది- సినిమా విడుదల కాకముందే డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్‌పై సైబర్ దాడుల ద్వారా కాపీలను పొందడం.
తమ విచారణలో పైరసీకి రెండు ప్రధాన మార్గాలు బయటపడ్డాయని సీవీ ఆనంద్ చెప్పారు. తమిళ ఎంవీ, టైల్ బ్లాస్టర్స్, మూవీరూల్జ్ వంటి పైరసీ పోర్టల్స్‌ను పోలీసులు గుర్తించారు. ఇవి ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ఆపరేటర్ల వంటి స్పాన్సర్‌ల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది. టొరెంట్ సైట్లు, టెలిగ్రామ్ ఛానెళ్లు, అక్రమ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పైరసీ ఫైల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొన్నారు. పైరసీని అరికట్టడానికి సైబర్ సెక్యూరిటీ పద్ధతులను పటిష్టం చేయాలని కమిషనర్ సూచించారు.
డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ఆడిట్‌లు, కఠినమైన యాక్సెస్ కంట్రోల్స్, అనుమానాస్పద కార్యకలాపాల గురించి తక్షణమే నివేదించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. థియేటర్ యజమానులు రికార్డింగ్ పరికరాలపై కఠినమైన నియంత్రణలు విధించాలని, నిఘాను మెరుగుపరచాలని కోరారు. నిర్మాణ సంస్థలు సినిమా కంటెంట్ భద్రతను పటిష్టం చేయడానికి ఫోరెన్సిక్ చర్యలు, వాటర్‌మార్కింగ్ వంటి పద్ధతులు ఉపయోగించాలని సూచించారు. పోలీసుల ఈ చొరవను సినీ పరిశ్రమ స్వాగతించింది. పైరసీ నివారణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications