మంట పుట్టిస్తున్న టమాటా.. కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి!!
సామాన్యులకు మళ్లీ కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. టమాటా ధరలు మళ్ళీ పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. టమాటా ప్రతీ ఇంట్లో వంటల్లో నిత్యావసరంగా వాడే క్రమంలో ఏపీ, తెలంగాణాలో పెరుగుతున్న ధరలతో ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు.
సెంచరీ దాటిన టమాటా
నిన్నటి వరకు కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయలు పలికిన టమాటా ధర మళ్ళీ సెంచరీకి చేరుకుంది. బహిరంగ మార్కెట్లో టమాటా ధర సెంచరీ దాటడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మార్కెట్ లో టమాటా డిమాండ్ కు తగ్గట్టు సప్లై లేకపోవటంతో టమాటా ధరలు పెరిగాయి.

టమాటా ధరల పెరుగుదలకు కారణమిదే
గత కొద్దిరోజుల పాటు తగ్గుముఖం పట్టిన టమాటా ధరలు మళ్ళీ పెరగడం సామాన్యులకు అశనిపాతంగా మారింది. విపరీతంగా పడుతున్న వర్షాల కారణంగా టమాటా పంట చేతికి రాకపోవడం, అలాగే మొన్నటి వరకు వర్షభావ పరిస్థితులతో దిగుబడి తగ్గటం కూడా టమాటా ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తొలకరి పంట ఇంకా చేతికి రాని కారణంగా సెప్టెంబర్ నెల వరకు ధరలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది.
టమాటా తోడుగా పెరుగుతున్న ఉల్లి ధరలు
ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు కూడా టమాటా ధరల పెరుగుదలకు కారణంగా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టమాటా దిగుబడులు లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయని భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఉల్లిపాయలు కూడా సామాన్యులకు కంటనీరు తెప్పిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లిపాయలు 55 రూపాయల నుండి 60 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ధరల నియంత్రణకు సామాన్యుల విజ్ఞప్తి
ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్న ఉల్లిపాయలు తప్ప తెలుగు రాష్ట్రాలలో ఉల్లి ఉత్పత్తి పడిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఉల్లిపాయల ధర క్రమక్రమంగా పెరుగుతున్న క్రమంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉల్లిపాయలను కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కూడా ఉల్లి ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. టమాటా ధరలు, ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరుగుతున్న తీరుపైన ప్రభుత్వాలు దృష్టి సారించి వాటిని నియంత్రణలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications