గంజాయి అడ్డాలుగా ప్రముఖ యూనివర్సిటీలు.. దాడులలో సంచలన విషయాలు!
హైదరాబాద్‌లోని ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ఈగిల్ ఫోర్స్ తాజాగా చేపట్టిన నిఘా, దాడుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నల్సార్ లా యూనివర్సిటీ, గీతం విశ్వవిద్యాలయం క్యాంపస్‌లలో గంజాయి సరఫరా, వినియోగం జరుగుతున్నట్లు బయటపడింది. ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ వివరాలను వెల్లడించారు.
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తాజాగా సోదాలు జరిపినప్పుడు 24 మంది విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నట్లు డ్రగ్స్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. వీరికి గంజాయి అందిస్తున్న వాచ్‌మన్ భిక్షసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నల్సార్ యూనివర్సిటీలో 17 మంది విద్యార్థులు మత్తుకు బానిసైనట్లు గుర్తించారు.

గీతం విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి విషయంలో కూడా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.యూనివర్సిటీల యాంటీ డ్రగ్ కమిటీలు, ఈగిల్ ఫోర్స్ కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. మత్తు అలవాటు తగ్గించేందుకు డీ-అడిక్షన్ సెంటర్లకు పంపాలని సూచించారు. గతంలో కూడా హెచ్‌సీయూలో ఇలాంటి కేసులు నమోదైన విషయం గుర్తు చేశారు.
క్యాంపస్‌లలో, హాస్టళ్లలో, క్యాంటీన్ల వద్ద ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో నిఘాను ముమ్మరం చేశారు.విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడితే చదువు, కెరీర్, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయి. కుటుంబాలపైనా ఆర్థిక, మానసిక ఒత్తిడి పడుతుంది. డ్రగ్స్ విషయంలో యూనివర్సిటీలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రజలను కోరుతూ.. డ్రగ్స్ సరఫరా లేదా వినియోగం గురించి సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా 87126 71111 వాట్సాప్‌కు తెలియజేయాలన్నారు. రహస్యంగా సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం యువతలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. క్యాంపస్‌లలో అవగాహన కార్యక్రమాలు, కఠిన నిఘా ఏర్పాటు చేస్తోంది. విద్యాసంస్థలు భవిష్యత్తు నిర్మాతలను తీర్చిదిద్దే ప్రదేశాలు. అక్కడే ఇలాంటి సమస్యలు పెరగడం ఆందోళనకరంగా ఉన్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసులు కలిసి పనిచేస్తేనే ఈ ధోరణిని అరికట్టవచ్చు.












Click it and Unblock the Notifications
