కోమటిరెడ్డి రాజగోపాల్, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ కీలకవ్యాఖ్యలు.. సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ పార్టీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై దుమారం మొదలైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు.
ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని సూచనలు ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఏ సందర్భంలో ఏమన్నారో పార్టీ హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడతామని ఆయన అన్నారు.ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి నిధుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గాలకు నిధులు సరిగా ఇవ్వడం లేదని, కొడంగల్, మధిర వంటి నియోజకవర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. సీఎం తనను బెదిరిస్తున్నారని కూడా అన్నారు. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకపోవడం, అధికారులు కమీషన్లు అడుగుతున్నారని బహిరంగంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నాయని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో కూడా ఈ ఇద్దరు నేతలు ప్రభుత్వంపై, సీఎంపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పార్టీ నాయకత్వం సంయమనం పాటించింది. కానీ ఇప్పుడు హైకమాండ్ స్థాయిలో ఈ వ్యాఖ్యలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల కొండా సురేఖ విషయంలో పార్టీ చర్యలు తీసుకున్న విధంగానే ఇక్కడ కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కొందరు నేతలు అంటున్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉందని చర్చలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ సంకేతాలు ఇచ్చారు. అయితే పార్టీ క్రమశిక్షణను కాపాడుకోవడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అభివృద్ధి నిధుల పంపిణీ, బిల్లుల చెల్లింపులు వంటి అంశాలపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది.
ఇలాంటి అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నాయకులు భావిస్తున్నారు.రాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమే. కానీ అవి బహిరంగ వేదికల్లో వ్యక్తం కావడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో రానున్న రోజుల్లో తేలుతుంది.













Click it and Unblock the Notifications
