రేవంత్ పై సీనియర్ల "డీకే" అస్త్రం - రంగంలోకి ట్రబుల్ షూటర్..!?
కర్ణాటక ఎన్నికలు ముగియటంలో కాంగ్రెస్ తెలంగాణ పైన ఫోకస్ చేస్తోంది. ఇదే సమయంలో కర్ణాటక నేతలకు తెలంగాణ బాధ్యతలను అప్పగించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. తెలంగణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా పోరు మారుతోంది. క్షేత్ర స్థాయిలో బలం ఉన్నా..సరైన వ్యూహాలు, నాయకుల మధ్య ఐక్యత లేని కారణంగా తెలంగాణలో మోహరించేందుకు కొత్త నేతలను రంగంలోకి దించుతోంది. దీనికి సీనియర్లు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
తెలంగాణ బరిలో డీకే: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక ప్రముఖంగా వినిపిస్తున్న పేరు డీకే శివకుమార్. కేపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు డీకే అవసరం ప్రభుత్వం కంటే పార్టీ పరంగా అవసరమని పార్టీ నాయకత్వం గుర్తించింది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సిద్దరామయ్యను అక్కడ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. డీకే కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తూనే ఆయన సేవలను పార్టీ పరంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పలు సందర్భాల్లో సక్సెస్ అయిన డీకే శివకుమార్ కు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జ్ గా నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తెలంగాణ సీనియర్ నేతలు ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

రంగంలోకి ట్రబుల్ షూటర్: తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ నాయకత్వం పైన సీనియర్లు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ గా థాక్రే వచ్చిన తరువాత పరిస్థితుల్లో కొంత మేర మార్పు కనిపిస్తున్నా ఇంకా పూర్తిగా మారలేదు. ఇక, కాంగ్రెస్ దక్షిణాది తరువాత తెలంగాణ కీలకంగా మారుతోంది. అక్కడ బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలన పూర్తి చేసుకోవటం తో పాటుగా తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం గా ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ ఉందని గుర్తించారు. దీంతో ముందుగా నాయకుల మధ్య ఐక్యత తీసుకొస్తే పార్టీ విజయం కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో ఇటువంటి సంక్షోభాలను పరిష్కరించిన నేతగా ఉన్న డీకేను తెలంగాణ ఎన్నికల్లో ప్రయోగించాలని పార్టీ భావిస్తోందని సమాచారం.

పార్టీని గెలిపిస్తారా: తెలంగాణలో డీకే పెద్ద దిక్కుగా మారబోతున్నారు. ఇప్పటికే డీకేను టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా కలిసారు. ఈ సారి డీకే శివకుమార్ కర్ణాటక ఎన్నికల్లో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ సత్ఫలితాలను ఇచ్చింది. ఫలితంగా తెలంగాణలోనూ సాగుతున్న సామాజిక సమీకరణంలో కీలకం కానున్నారు. పొత్తులు..ఎత్తుల్లో డీకే రాజకీయంగా అనుభవం ఉన్న నేత. దీంతో, ఇప్పుడు పార్టీ సీనియర్లు కూడా ఎన్నికల సమయంలో తెలంగాణ ఇంఛార్జ్ గా డీకే శివకుమార్ కు బాధ్యతలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా సీట్ల ఖరారులో రేవంత్ నిర్ణయాలకు చెక్ పెట్టాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి రావటమే ముఖ్యమని చెబుతున్న రేవంత్ ఈ ప్రతిపాదనకు సహకరించాల్సిన పరిస్థితి. దీంతో.. డీకే కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చే మార్పులు..చోటు చేసుకొనే పరిణామాల పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications