వరంగల్ అష్ట దిగ్బంధనం..ముంపు కాలనీల పరిస్థితి దయనీయం!
వరంగల్ హన్మకొండ జిల్లాల వ్యాప్తంగా అతి భారీ వర్షాల కారణంగా 115 కాలనీలు నీట మునిగాయి. ప్రస్తుతం వరంగల్, హనుమకొండ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హన్మకొండలోని ఊరచెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఊర చెరువుకు గండి పడటంతో హన్మకొండలోని అనేక కాలనీలు నీటమునిగాయి.
వరంగల్ జల దిగ్బంధం
హన్మకొండ జిల్లాలోని బొంది వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. సమ్మయ్య నగర్, గోకుల్ నగర్, డీకే నగర్, సంతోషిమాత కాలనీ, సాయి గణేష్ కాలనీ, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, పరిమళ కాలనీ, గాంధీనగర్, కాపువాడ, కాకతీయ కాలనీ ఫేస్ టు, కాకతీయ కాలనీ ఫేస్ వన్, రాయపుర, ఇటు భద్రకాళి బండ్ పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

నీట మునిగిన కాలనీలు, రెస్క్యూ ఆపరేషన్
హన్మకొండలోని హంటర్ రోడ్ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీట మునిగింది. ప్రస్తుతం ఈ హాస్టల్లో 200 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిని రెస్క్యూ బృందాలు రెస్క్యూ చేస్తున్నాయి.వరంగల్లోని అండర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతం, రామన్నపేట, కాశిబుగ్గ, వరంగల్ ఎన్ ఎన్ నగర్, బిఆర్ నగర్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డి ఆర్ యఫ్, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బోట్ల సహాయంతో వరద ముంపులో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
రంగంలో ఏడు రెస్క్యూ బృందాలు
వరంగల్ నగరంలో ఏడు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. బీరన్న కుంట ప్రభుత్వ పాఠశాల, వరంగల్ లోని ఆరేపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఎనుమాముల మార్కెట్లోని శుభం గార్డెన్ , కొత్త వాడలోని లక్ష్మీ గార్డెన్ తదితర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
సహాయక చర్యల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు
హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య ముంపు ప్రమాద బాధితులను పరామర్శిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నారు. రహదారులపై భారీగా వరద చేరటంతో వరంగల్, హన్మకొండ నగరాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురి కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది.ఇటు వరంగల్ నగరానికి కరీంనగర్ నుంచి వచ్చే రోడ్లు, హైదరాబాద్ నుండి వచ్చే రోడ్లు కూడా ముంపుకు గురి కావడంతో నగరం జలదిగ్బంధనం గా మారింది. ఈరోజు వర్షం ప్రస్తుతం తెరపినివ్వడంతో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications