waterfalls Videos: ఆకాశగంగ జాలువారినట్టు.. వెలుగులోకి ముత్యాల ధార, చిట్టి ముత్యాలధార; గుండం జలపాతాలు!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో లెక్కకు మిక్కిలి జలపాతాలు ఈ వర్షాకాలంలో పర్యాటకుల మనసులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికి చాలా మందికి తెలిసిన బొగత, భీముని పాదం వంటి జలపాతాలతో పాటు దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తయిన గుట్టల నుండి ఆకాశగంగ దిగి వస్తున్నట్టుగా ఉన్న జలపాతాలు ఇటీవల కాలంలో అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అటువంటి జలపాతాలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి.
ముత్యాల ధార జలపాతం, గుండం జలపాతం, బొల్లారం చిట్టి ముత్యాల జలపాతం. ఈ జలపాతాల అందం, ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకుల మనసులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ముత్యాల ధార జలపాతం విషయానికి వస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన జలపాతం ముత్యాల ధార.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం కే మండలంలో ఈ జలపాతం ఉంది. వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారికి వీరభద్రపురం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ మార్గంలో కాలి నడకన ప్రయాణం చేస్తే ముత్యాల ధార జలపాతం వద్దకు చేరుకోవచ్చు. కొండల నడుమ 700 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం జాలువారుతుంది. అచ్చంగా ముత్యాలు జాలువారినట్టే ఈ ముత్యాల ధార జలపాతం ఉంటుంది.
ములుగు జిల్లా వాజేడు మండలంలో మరో అద్భుత జలపాతం గుండం జలపాతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. రెండు గుట్టల మధ్య నుండి జాలువారుతున్న అందాల జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. అరుణాచలపురానికి 1కి. మీ సమీపంలో ఈ జలపాతం ఉంది. సముద్రపు నీరు లాగే నీలి రంగులో ఉండడంతో పర్యాటకులు ఆసక్తిగా గుండం జలపాతం వద్దకు వెళుతున్నారు.
ఆకాశగంగ జాలువారినట్టు.. వెలుగులోకి ముత్యాల ధార, చిట్టి ముత్యాలధార; గుండం జలపాతాలు..!! pic.twitter.com/Dawm1Txemj
— oneindiatelugu (@oneindiatelugu) July 24, 2023
అంతేకాదు ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఉన్న బొల్లారం వాటర్ ఫాల్స్ కూడా పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. బొల్లారం వాటర్ ఫాల్స్ ను చిట్టి ముత్యాల జలపాతం అంటున్నారు. అక్కడికి వెళ్లడానికి కాలినడకన ఇబ్బంది పడాల్సి ఉన్నప్పటికీ, వెళ్లిన తర్వాత దొరికే అద్భుతమైన అనుభూతి మాత్రం వర్ణనాతీతం. ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం అటవీ ప్రాంతంలో చిట్టిముత్యాల జలపాతం తెల్లని చిట్టి ముత్యాలు దొర్లినట్లుగా జాలువారుతూ కనువిందు చేస్తోంది.












Click it and Unblock the Notifications