weather: తెలంగాణలో మరో 3 రోజులపాటు అతి భారీ వర్షాలు, ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర కొనసాగిన అల్పపీడనం మంగళవారం బలహీనపడింది.

అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి..
కానీ, అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్రా మీద కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్ళే కొలదీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. తూర్పు - పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 18° ఎన్ లాటిట్యూడ్ వెంబడి సముద్ర మట్టానికి 2.1 కి మీ నుంచి 5.8 కి మీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపునకి వంపు తిరిగి ఉన్నది. మంగళవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో, బుధవారం చాలా ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రదేశాల్లో వచ్చే అవకాశములున్నాయి.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఒకటి, రెండు ప్రదేశాల్లో, ఎల్లుండి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రదేశములలో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..
నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. సీమలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications