Rain: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలే, ఈ జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎండతీవ్రత నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ.. జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఆరబోసిన ధన్యాలు, పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
అయితే, మరో నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేటి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ క్రమంలో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణం లేదా సాధాణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. రాబోయే నాలుగు రోజులపాటు ఇలాగే ఉంటుందని.. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగండ్లు, పిడుగులు పడే అవకాశం ఉండటంతో వర్షం పడే సమయంలో అవసరమైతే తప్ప రైతులు, ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications