TS Polls: బీఆర్ఎస్ కు ఏపీ భరోసా ! లాస్ట్ ఆప్షన్ వాడేస్తున్నారా ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఇలా అన్నివైపుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్న పోటీతో ఆత్మరక్షణలో పడుతున్న బీఆర్ఎస్.. తిరిగి తమ పాత అస్త్రాన్ని బయటికి తీస్తోంది. పొరుగున ఉన్న ఏపీకి సంబంధించిన అంశాల్ని టచ్ చేస్తూ తిరిగి సెంటిమెంట్ ప్రయోగిస్తోంది.
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే అయితే గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలన లేకపోతే పక్కనే ఉన్న ఏపీలో పాలన, రాజధాని వంటి అంశాల్ని పదే పదే ప్రస్తావిస్తోంది. తెలంగాణలో తాము చేసిన అభివృద్ధిని చెప్పుకునే క్రమంలో అయినా పొరుగు రాష్ట్రంతోనే పోలిక తెస్తోంది. తాజాగా కేసీఆర్ మళ్లీ రాకపోతే హైదరాబాద్ కూడా అమరావతి అయిపోతుందంటూ ఆ పార్టీ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్ఎస్ ఎంత ఆత్మరక్షణలో ఉందన్న అంశం ఇట్టే అర్ధమవుతోంది.

పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాక అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తున్నామని కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నా క్షేత్రస్ధాయిలో పరిస్ధితి వేరేలా ఉంది. ముఖ్యంగా సంక్షేమం కోసం భారీ ఎత్తున ఖర్చుపెడుతున్నట్లు చెప్పుకుంటున్నా సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా అర్హులందరికీ అందుతున్న పరిస్ధితి కనిపించడం లేదు. దీంతో ఆయా వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో పదే పదే అభివృద్ధి, సంక్షేమం అంటూ ఊదరగొట్టే పరిస్ధితి లేదు. అందుకే తిరిగి పాత అస్త్రం బయటికి తీయాల్సి వస్తున్నట్లు అర్ధమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో తిరిగి ఆంధ్రా పెత్తనం కావాలా అనే ప్రశ్నను కేసీఆర్ గట్టిగా సంధించారు. అంతే కాదు అనుకున్న ఫలితం కూడా రాబట్టారు. అప్పట్లో ఎన్నికల్లో చెప్పుకోవడానికి బలమైన అజెండా లేదని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ... చేసిన ఆ తప్పిదం కేసీఆర్ కు వరంగా మారింది. దీంతో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్సే కాదు బీజేపీ కూడా అలాంటి తప్పిదాలు చేసేందుకు ఇష్టపడలేదు. అందుకే టీడీపీ, వైఎస్సార్టీపీ పార్టీలతో పొత్తుల్లేకుండానే ఇరు పార్టీలు బరిలోకి దిగాయి. దీంతో అటు కేసీఆర్ కు సెంటిమెంట్ రూపంలోనూ బలమైన అస్త్రం లభించలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications