హెచ్చరిక.. ఏపీ, తెలంగాణాలో మహిళలను మోసపు నూనెలో ముంచేస్తున్నారు!
జుట్టు అంటే ఇష్టం లేని మహిళలు ఎవరూ ఉండరు. బారెడు కురులతో, వాలు జడలతో అందంగా ముస్తాబవ్వాలని అనుకోని అతివలు ఎవరూ ఉండరు. జుట్టు పైన మహిళలు చూపించే విపరీతమైన ప్రేమ ఒక్కోసారి వారి బలహీనతగా కూడా మారుతుందని తాజాగా జరుగుతున్న పరిణామాలతో అర్థమవుతుంది.
మోకాళ్ళ దాకా జుట్టుతో యాడ్స్.. మోసపోతున్న మహిళలు
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ పేరుతో వస్తున్న యాడ్స్ చూసి అందులో మోకాళ్ళ దాకా పెరిగిన జుట్టును చూసి తమ జుట్టు కూడా అలా పెరిగితే బాగుంటుంది అని భావించిన మహిళలు ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ కొనడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ ఆసక్తి అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది.

ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ కోసం ఎడా పెడా ఆర్డర్లు
ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసిన ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ పైన పెద్ద ఎత్తున ప్రకటనలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. ఇక ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడితే తమ జుట్టు కూడా అంత ఒత్తుగా ఏపుగా పెరుగుతుందని భావించిన మహిళలు తాము ఏ సైట్లో లాగిన్ అయ్యాము అన్నది కూడా చూసుకోకుండా ఎడా పెడ ఆర్డర్లు పెట్టేస్తున్నారు.
ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో తెలీకుండా ఆర్డర్లు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ అన్ని ప్రాంతాలలోనూ ఈ నూనెను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. కొన్ని సైట్లలో 500 రూపాయలకు మరికొన్ని సైట్లో 900 రూపాయలకు ఇలా ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. అది ఒరిజినలా కాదా అన్నది చూసుకోకుండా మహిళలు ఏ సైట్ కనిపిస్తే అందులో ఆర్డర్లు పెడుతున్నారు. అసలు ఒరిజినల్ సైట్ ఏది, నకిలీది ఏది అన్నది అర్ధం కాని పరిస్థితి.
లక్షల సంఖ్యలో ఆర్డర్లు
రాష్ట్ర వ్యాప్తంగా ను ప్రతి ఏరియాలో ఇలా ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆర్డర్లు పెడుతున్న వారి సంఖ్య లక్షల లోనే ఉంది. తీరా ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ బాటిల్స్ లో ఉన్నది ఆయిల్ లా కాకుండా, ఏదో వనమూలికలు ఉడకబెట్టిన నీళ్లు లా ఉండడంతో అయినా సరే జుట్టు పెరుగుతుంది అన్న ఆశతో తలలకు పట్టించేస్తున్నారు.
కోట్ల రూపాయల దందా
కానీ జుట్టు పెరగకపోవడం, జుట్టు ఊడిపోవడం వంటివి చోటు చేసుకోవడంతో తాము కొన్న ఆయిల్ ఒరిజినలా కాదా అని అప్పుడు ఆలోచనలో పడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ పేరుతో కోట్ల రూపాయల దందా జరుగుతుంది. ఏది చూస్తే అది నిజమని నమ్ముతున్న మహిళలు తమ జుట్టు బలహీనతతో అనవసరంగా డబ్బు పోగొట్టుకుంటున్నారు.
సైబర్ క్రైం పోలీసులు దీనిని ఆపగలరా?
ఏది ఏమైనా ఎవరికి అర్థం కాకుండా జరుగుతున్న ఈ దందా పైన, నకిలీ వెబ్సైట్ల పైన సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెడితే, నకిలీ వెబ్సైట్ లకు చెక్ పెడితే మహిళలు ఈ విధంగా మోసపోకుండా ఉంటారు.












Click it and Unblock the Notifications