కత్తిపీటతో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది; పాతబస్తీలో దారుణం
ప్రేమ పేరుతో యువతులపై దాడులు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడిన ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది యువతిపై కత్తిపీటతో దాడిచేయగా యువతీ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ప్రేమోన్మాది దాడిలో తీవ్ర గాయాలపాలై కొట్టుమిట్టాడుతున్న యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
ఛత్రినాక పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఈరోజు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రావ్య అనే యువతిపై మణికంఠ అనే వ్యక్తి కత్తిపీటతో దాడి చేశాడు. 15 సంవత్సరాల క్రితం వరంగల్ నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన శ్రావ్య తన తల్లితో కలిసి ఎన్నార్టీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మణికంఠ దూరపు బంధువు.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.

తనతో మాట్లాడటం లేదని అనుమానం
చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ స్నేహంగా ఉండడం వల్ల మణికంఠ విషయంలో తల్లికి ఎప్పుడు పెద్దగా అనుమానం కూడా రాలేదు. అయితే 2019లో హర్ష అనే వ్యక్తితో వివాహం జరిగిన శ్రావ్య మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. శ్రావ్య విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. భర్తతో శ్రావ్య విడిపోవడంతో తను పెళ్లి చేసుకుంటానంటూ ప్రపోజల్ పెట్టిన మణికంఠతో గత కొద్దిరోజులుగా శ్రావ్య మాట్లాడటంలేదు. దీంతో అతనిలో అనుమానం మొదలైంది.
యువతి ఇంటికి వెళ్లి దాడి
తనకు విడాకులు మంజూరు అయ్యే వరకు ఆగాలని తన కేసు కోర్టులో ఉందని శ్రావ్య చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే శ్రావ్య వేరే వాళ్ళతో మాట్లాడుతుందని కోపం పెంచుకున్న మణికంఠ అనుమానంతో జిమ్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో శ్రావ్యని వెంబడించి శ్రావ్య ఇంట్లోకి వెళ్ళగానే తను కూడా లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టి ఆమెపై దాడి చేశాడు.
స్క్రూడ్రైవర్, కత్తిపీటతో దాడి
స్క్రూ డ్రైవర్ తోను, కత్తిపీటతోను శ్రావ్యపై దారుణంగా దాడి చేశాడు, శ్రావ్య చాతి భాగంతో పాటు, మొహం పైన తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రావ్య అరుపులతో స్థానికులు మణికంఠను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సకాలంలో వైద్యం అందడంతో శ్రావ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఏది ఏమైనా సమాజంలో ఇటువంటి ఘటనలు మహిళల భద్రతను అనుక్షణం ప్రశ్నిస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications