శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తోన్నారు. రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
శుక్రవారం నాడు 71,037 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,635 మంది తలనీలాలను సమర్పించారు. 10 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి 18 గంటల సమయం పట్టింది. హుండీ ద్వారా 3.89 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

2024 మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు విడుదల చేస్తారు. అదే నెలకు సంబంధించిన వసతి గదుల కోటా టికెట్లు కూడా అదే రోజున విడుదల అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.
తిరుమల, తిరుపతిల్లో వేర్వేరుగా అనేక రకాల వసతి గదులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి.
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
మార్చి 2024 నాటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18వ తేదీన ఓపెన్ అవుతుంది. 18వ తేదీన ఉదయం 10 నుంచి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఇది అందుబాటులో ఉంటుంది. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల్లో పాల్గొనే భక్తులకు టికెట్ల బుకింగ్ ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆరంభమౌతుంది.
తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు, సీనియర్ సిటిజన్లు/దివ్యాంగుల కోటా బుకింగ్ అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం కేటాయించిన దర్శనం, వసతి గదుల కోటా 23వ తేదీ నాడు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో వస్తాయి.












Click it and Unblock the Notifications