శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీదులు తనిఖీలు చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులను టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడసేవకు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇందులో భాగంగా, జిల్లా పోలీసులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి, వివిధ గ్యాలరీల్లోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు.

గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం, తదితర భద్రతా అంశాలను ఇదే సందర్బంలో పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి, వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామరావు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
టీటీడీలోని విభాగాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ నిఘా, భద్రత విభాగాలు, పోలీసులు సమన్వయంతో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు తదితర అధికారులు తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మరథాలను పరిశీలించారు.
తిరుమలలోని శ్రీవారి సేవాసదన్ 1, 2 భవనాలను శుక్రవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవో రెండు భవనాలను క్షుణ్ణంగా పరిశీలించి, తిరుమలలో వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల నమోదు, లాకర్లు, స్కార్ఫ్‌లు, బెడ్‌లు, డ్యూటీల కేటాయింపు, ఆలయ విధులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్, సత్సంగం, ధ్యానం మరియు భజన కార్యక్రమాలను పరిశీలించారు.
అనంతరం శ్రీవారి సేవాసదన్ 2 లోని జీడిపప్పు వలుచు హాల్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
తరువాత సేవా సదన్ లలో పరిశుభ్రత, శ్రీవారి సేవకుల వసతి, అన్నప్రసాదం, దర్శనం తదితర సౌకర్యాలను ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం శ్రీవారి సేవకులతో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులు తమకు కల్పిస్తున్న సౌకర్యాలపై చాలా సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications