జగన్ సర్కార్‌కు చెంపపెట్టు.. హైకోర్టు తీర్పుపై సీపీఐ నారాయణ
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు.

తొత్తులుగా మారొద్దు
ఏప్రిల్ 1వ తేదీన ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్ తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం కరెక్టేనని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారితే ఇబ్బందులు తప్పవని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని ఉద్దేశించి కామెంట్ చేశారు. అధికార వ్యామోహంతో తొత్తులుగా వ్యవహరించిన అధికారులు గతంలో జైలు పాలయిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు.

హడావిడిగా ఎందుకు
కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించారని గుర్తచేశారు. హడావిడిగా ఎన్నికల నిర్వహణ జరిపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఎన్నికలపై స్టే ఇచ్చిందని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు సీఎం జగన్ పాలనకు అవమానకరమని కామెంట్ చేశారు.

ఎన్నికలకు రెడీ..
ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించడం మంచి పద్దతి కాదని నారాయణ అన్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదని గుర్తు చేశారు. ఎన్నికలను బహిష్కరించడం అంటే రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అందించిన ఓటు హక్కును అవమానించడమేనని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుని ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు.

ఐబీ ఫెయిల్యూర్
ఛత్తీస్ ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ దురదృష్టకరం అని నారాయణ అభిప్రాయపడ్డారు. ఎక్కువమంది పోలీసు యువకుడు చనిపోవడం తమను కలచివేసిందని తెలిపారు. కేంద్ర నిఘా వైఫల్యం వల్లే భీకర ఘటన జరిగిందని కామెంట్ చేశారు. మావోయిస్టు ప్రాబల్యం గల ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహణ సమయంలో నిఘావర్గాల ముందస్తు సమాచారం ఎందుకు అందలేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టిన కేంద్రం దేశ భద్రత విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందని నిలదీశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు.