విజయవాడలో 144 సెక్షన్- 50 రోజుల పాటు అమలు
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీసులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ సిటీలో 144 సెక్షన్‌ను విధించారు. 50 రోజుల పాటు ఈ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భధ్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు.
విజయవాడ నగర పోలీస్ కమిషన్ కార్యాలయం పరిధిలో గల 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇవ్వాళ్టి నుంచే ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఇబ్రహీంపట్నం, భవానీపురం, వన్ టౌన్, టూ టౌన్, సత్యానారాయణ పురం, అజిత్ సింగ్ నగర్, నున్న, గవర్నర్ పేట, కృష్ణలంక, మాచవరం, గుణదల, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి.

ఆగస్టు 28వ తేదీ వరకు అంటే.. 50 రోజుల పాటు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 144 (2) కింద ఈ నిషేధాజ్ఞలను జారీ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, వారి రోజువారీ జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా, నగర పరిధిలో శాంతి భధ్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నలుగురు లేదా అంతకుమించి ఎక్కువ మంది జనం బహిరంగ ప్రదేశాల్లో గుమికూడి ఉండరాదు. కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలను తమ వెంట తీసుకుని తిరగకూడదు. ఈ నిషేధాజ్ఞలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications