ఐటీ హబ్ గా వరంగల్: కొత్తగా ఓరుగల్లుకు జెన్‌పాక్ట్; మంత్రి కేటీఆర్, వరంగల్ వాసుల హర్షం
ఐటీ రంగంలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ సర్కారు నడుం బిగించిందా ? తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరం పై ప్రత్యేకమైన దృష్టి సారించారా? ఐటి దిగ్గజ కంపెనీలను వరంగల్లో తమ శాఖలను ఏర్పాటు చేయడానికి మంత్రి కేటీఆర్ సమాలోచనలు జరుపుతున్నారా? పారిశ్రామికంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

వరంగల్ లో వడివడిగా అడుగులు వేస్తున్న ఐటీ
ఐటీ రంగంలో నిలదొక్కుకోవడం కోసం వరంగల్ నగరం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అభివృద్ధిలో వరంగల్ రెండో స్థానంలో ఉంది. గత కొంతకాలంగా వరంగల్ ను ఐటి హబ్ గా తీర్చి దిద్దడం కోసం ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకమైన దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నగరంలో అనేక స్టార్టప్ లతో పాటుగా, సెయింట్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు తమ క్యాంపస్లను ప్రారంభించాయి. మరి కొన్ని కొత్త కంపెనీలు కూడా వరంగల్ లో ఐటీ పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నాయి. ఇక తాజాగా ఇప్పటికే ఉన్న సెయింట్, టెక్ మహీంద్రాల సరసన జెన్‌ప్యాక్ట్ కూడా చేరనుండడంతో వరంగల్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఐటి దిగ్గజం జెన్‌పాక్ట్ వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు ప్రకటన
ఐటి మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు (కెటిఆర్)తో సమావేశం తరువాత ఐటి దిగ్గజం జెన్‌పాక్ట్ వరంగల్‌లో తన టెక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జెన్‌ప్యాక్ట్ వరంగల్‌ను ఎంచుకుని క్యాంపస్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతిబింబించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జెన్‌పాక్ట్ వరంగల్‌లో టెక్ సెంటర్ ఏర్పాటుకు సిద్దమైంది. సీఎంకు నా అభినందనలు. జెన్‌పాక్ట్ సిఈఓ త్యాగరాజన్ కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. టైర్-II పట్టణాలలో ఐటీని బలోపేతం చేసే మా ప్రయత్నానికి త్యాగరాజన్ బృందం మద్దతు ఇస్తుంది. జెన్‌పాక్ట్ నిర్ణయంతో వరంగల్ అత్యున్నత స్థాయికి చేరుకుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

వరంగల్ లో ఐటీ అవసరాలకు తగ్గట్టు మౌలిక వసతుల కల్పనపై దృష్టి
వరంగల్‌లో రాకపోకల సౌలభ్యంపై దృష్టి సారించిన మంత్రి వరంగల్‌లో పట్టణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలను సైతం వేగవంతం చేశారు. వరంగల్ జిల్లాకు హైదరాబాద్‌తో చాలా మంచి కనెక్టివిటీ ఉందని, ఐటి కారిడార్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. అంచెలంచెలుగా నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు జెన్‌పాక్ట్ బృందం చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో ఐటీ టవర్లను ఏర్పాటు చేసింది. నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేటలో ఐటీ టవర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
Recommended Video

ఎయిర్ పోర్ట్ వినియోగంలోకి తీసుకురావటానికి ప్రయత్నాలు
సమానమైన అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రభుత్వం టైర్-II నగరాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా ఐటీ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. ఇదే ఈ క్రమంలో జెన్‌పాక్ట్ అనేది వరంగల్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న తాజా ఐ టి ఐ కంపెనీ, దీనికి ముందు టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ, సెయింట్ వంటి కంపెనీలు ఇప్పటికే తమ క్యాంపస్ లను వరంగల్లో ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే వరంగల్లో వృద్ధి చెందిన ఐటీ పరిశ్రమ, రెడీ అవుతున్న టెక్స్టైల్ పార్కు కోసం పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా వరంగల్ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించడానికి కూడా ప్రస్తుతం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్ నగరాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి చెందిన నగరాలలో సరసన నిలబెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications