• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరాయి సంస్కృతి, ప్రవాస సంక్షోభం

By -కె. శ్రీనివాస్‌
|

వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వారు ఈ మధ్య 'అమెరికా తెలుగు కథ' అనే ఒక కథా సంకలనం తెచ్చారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ప్రధానంగా తమ జీవితం గురించి, అందులోనూ ప్రవాస జీవితం గురించి రాసుకున్న కథల సంకలనం ఇది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఇంద్రగంటి జానకిబాల సంపాదకత్వం వహించిన ఈ కథలు తెలుగు అమెరికన్ల మనోభావాలను, భయాందోళనలను, బెంగలను, సంక్షోభాలను, సంశయాలను- వ్యక్తం చేయడానికి ప్రయత్నించాయి. ఆరేడేళ్లుగా తమ కొరకు తామే ప్రచురించుకుంటున్న కథా సంకలనాల గురించి మాట్లాడవలసి వస్తున్న ఈ సందర్భం ప్రత్యేకమైనది. అమెరికా అన్న మాటే మునుపటి వలె ధ్వనించడం లేదు. ఒక ప్రభుత్వంగా ఒక అధికారంగా అది రానురాను ప్రపంచంలోని అన్ని సమాజాలలో కల్పించుకుంటున్న ప్రమేయం ఒక వైపున ఆందోళన కలిగిస్తున్నది. మరొక వైపు ఒక సంస్కృతిగా అది మన జీవితాలలోకి చొచ్చుకు వస్తున్న తీరు ఎంతో అభ్యంతరకరంగా వుంటున్నది. ఒక అగ్రరాజ్య శక్తిగా ప్రపంచంలో అది వ్యవహరిస్తున్న తీరుకు వస్తున్న ప్రతిఘటనలు, ప్రతీకారాలు ఎంతో దూరాన వున్న భారతదేశం వంటి దేశాల మీద కూడా ప్రభావం వేస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, తెలుగువారు, అక్కడి పౌరసత్వం పొందినవారు, కొత్తగా వెడుతున్న వారు- వీరి భద్రత, ప్రతిపత్తి అన్నీ ప్రశ్నార్థకమైన సందర్భం ఇది. ఇన్ని అంతర్జాతీయ సమస్యలతో పాటు తెలుగు సాహిత్యరంగంలో అమెరికన్‌ ఆంధ్రుల పలుకుబడి పెరగడం గురించి అనేక భయాలు, సందేహాలు వ్యాపించి ఉన్న సందర్భం ఇది. అమెరికా మీద రాజకీయ విమర్శ పెడితే అమెరికాంధ్రులలో అనేకులు ఇప్పుడు సందేహించడం లేదు.

1960 దశాబ్దంలో అమెరికాకు వెల్లువగా తరలి వెళ్లిన వృత్తినిపుణులు- మళ్లీ ఎప్పుడో తిరిగి స్వదేశానికి వస్తామని తమకు తాము ధైర్యం చెప్పుకుంటూ వెళ్లారు. కానీ, వారి కుటుంబాలు అక్కడే పెరిగి, వారి పిల్లలు అక్కడి పౌరులయిపోయి- తిరిగి రాలేని పరిస్థితిలో వున్నారు. వలస వెడుతూ తమతో పాటు తీసుకు వెళ్లి పదిలంగా కాపాడుకుంటూ వచ్చిన జ్ఞాపకాలు క్రమంగా మసకబారిపోతున్న సమయంలో- గ్లోబలైజేషన్‌ ప్రక్రియ అమెరికన్‌ ఆంధ్రులలో కూడా ఒక అస్తిత్వ వేదనను రగిలించిన సందర్భంలో అమెరికన్‌ ఆంధ్రులు స్వదేశంలోని సాహిత్య, సాంస్కృతిక రంగాలతో మునుపటి కంటె బలమైన సంబంధాల కోసం పయత్నిస్తూ ఉన్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా- ప్రవాసాంధ్రులకు స్వదేశంతో ఏర్పడిన ఆర్థిక సంబంధాల స్వభావమేమిటో ఖచ్చితంగా చెప్పలేం కానీ, గత పది సంవత్సరాలుగా అమెరికన్‌ ఆంధ్రులు ముప్పై నలభై ఏండ్ల కిందటి 'ఆంధ్ర' దేశాన్ని కలవరించడం మొదలు పెట్టారు. దురదృష్టవశాత్తు- ఆ ఆంధ్రదేశం ఇప్పుడు ఆంధ్రదేశంలో కూడా భౌతికంగా లేదు. 'అమెరికన్‌ తెలుగు కథ'లోని చాలా కథలను చదివినప్పుడు, కథకుల నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు- వీరిలో చాలా మంది భారతదేశంలోనే ఉండిపోతే రచయితలయ్యేవారు కాదేమో అనిపించింది. ప్రవాసత్వంలోని అస్తిత్వ తపనే వారిని రచయితలను చేసి వుండాలి. విదేశాలకు వెళ్లినా భారతీయ సంస్కృతీ ఆచారాలను వదిలి పెట్టడం లేదని- భారతీయ సమాజానికి పదే పదే హామీ ఇచ్చుకోవడం దగ్గర నుంచి మొదలు పెట్టి- తాము వదిలి పెట్టి వచ్చిననాడున్నట్టుగా భారతీయ సమాజం ఆచారవంతంగా, సంస్కృతీభరితంగా ఉండడం లేదన్న ఫిర్యాదు వరకు ఈ కథలలో కనిపిస్తాయి. అమెరికన్‌ సమాజంతో తమ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన విశేషాలతో- భారతీయ పాఠకులకు ఆసక్తి ఉన్న అంశాలను మాత్రమే ఈ రచయితలు ఎక్కువగా స్పృశించారు. ఆర్జన కోసం, అవకాశాల కోసం దేశాన్ని, సంస్కృతిని వదలిరావడానికి సంబంధించిన ఒక నేర భావన ప్రవాసాంధ్ర రచయితలందరిలోనూ ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూ వుంటుంది. సంస్కృతి విషయంలో అమూర్తంగా ఉన్న ఈ నేర భావన-స్వదేశంలో వదిలి వచ్చిన తలిదండ్రుల విషయంలో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతీయ కుటుంబం, సంస్కృతి గురించి- భారతదేశంలో కనిపించే డిస్కోర్సు కూడా అమెరికన్లను ప్రభావితం చేస్తూ వుంటుంది. మరొక వైపు- పరాయి దేశంలో మైనారిటీగా జీవిస్తూ ఉండడం వల్ల- తమ సంస్కృతికి సంబంధించిన ఉమ్మడి చిహ్నాలను నిర్మించుకునే ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉంటారు. ఆ చిహ్నాలు చాలా సందర్భాల్లో అగ్రవర్ణ చిహ్నాలే అయి వుంటాయి. ఆంధ్రదేశంలో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ పూజించని కులాల వారు కూడా అమెరికాకు వెడితే ఆ దేవుడిని ఆశ్రయించాలి. ఫారిన్‌ వెళ్లగలిగిన దేవుడు అతడొక్కడే కదా! అలాగే, స్వదేశంలో కర్నాటక సంగీతం అంటే ముఖం చిట్టించుకునే వారు అక్కడ దాన్ని స్వాభిమాన తీవ్రతతో ఆస్వాదిస్తూ ఉంటారు. అక్కడ అమెరికన్లకు తమ గురించి అందించే చిహ్నాలు కొన్ని వుంటాయి, తాము వదిలి వచ్చిన దేశంలోని తమ వారికి తమ గురించి అందించే ముద్రలు మరి కొన్ని ఉంటాయి. వీటన్నిటి ఆనవాళ్లు ఈ 'అమెరికన్‌ తెలుగు కథ'లో గమనించవచ్చు.

ఇందులో కథల శ్రేణి- అమెరికన్‌ సమాజంతో ఇంకా ప్రాథమిక స్థాయి భిన్నత్వాన్ని ప్రతిబింబించడం దగ్గరి నుంచి, పూర్తిగా అమెరికన్‌ తరహా జీవితంలో పడిపోయిన వారి కథనం దాకా ఉన్నది. చెరుకూరి రమాదేవి కథ 'యాధృచ్ఛికం'లో కథా నాయిక సంపూర్ణ అమెరికన్‌లతో కరచాలనం చేయకుండా నమస్కారం చేయడంలోనే భారతీయతను ప్రకటిస్తుంది. సుధేష్ణ రాసిన 'మొగుడు కావాలా' కథలో సీమ పాత్ర అమెరికన్‌ తరహాలో భారతీయ వరుడినే ఎంచుకుంటుంది. తమ సంతానం అనుసరించే పద్ధతుల మీద అసహనం, విమర్శ ఉన్న తలిదండ్రులు మాత్రమే కాక, తమ పిల్లల ధోరణులను తమ పద్ధతిలో అర్థం చేసుకునే తలిదండ్రులు కూడా ఈ కథలలో కనిపిస్తారు. చిమట కమల రాసిన 'అమెరికా ఇల్లాలు' కథలో పాతను వదిలించుకోలేని, కొత్తను పూర్తిగా వరించలేని కథానాయికను చూడవచ్చు. పుచ్చా అన్నపూర్ణ రాసిన 'పెళ్లి' అనే కథలో కథా నాయిక శ్రీదేవి తన కొడుకు సెక్సువాలిటీ గురించి పరోక్ష వ్యాఖ్య చేస్తుంది. ఒక ఆడపిల్లతో సంసారం చేయగలడో లేదో ఇంకా తేల్చుకోలేకపోతున్నవాడిగా తన కొడుకును చెబుతుంది. ఆ కథలో శ్రీదేవి తెలుగువారి పెళ్లిల్లను మిస్‌ అవుతుంటుంది, చివరకు తన భర్తే లేటు వయసులో రెండో పెళ్లి చేసుకోబోవడంగా ఆమెకు పెళ్లి తారసపడుతుంది.

స్వదేశాన్ని విడిచి పెట్టి, స్వధర్మాన్ని కూడా విడిచి పెట్టి- కేవలం భౌతికంగా బతుకుతున్నామేమో అని కుంగిపోవడం దగ్గర నుంచి- కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడం, ఘర్షణ ఉన్న చోట పరిష్కారానికి ప్రయత్నించడం, ఔదార్యంతో సహనంతో పరాయి విలువలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, అమెరికన్‌ సమాజంలోని అసమానతల విషయంలో కూడా ఎంతో విచక్షణతో, సామాజిక న్యాయభావనతో వ్యవహరించాలని ప్రయత్నించడం, ఆర్జనా సంపాదనల కోసమైనా సరే నిర్విచక్షణగా నిర్దాక్షిణ్యంగా లోభంతో వ్యవహరించే ధోరణులను విమర్శించడం- ఈ కథలలో కనిపించే విశేషాలు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు ఇంఆక తమ వేళ్లతో సంబంధాలను తెంచుకోలేక- నిలుచున్న నేలతో సర్దుబాటు చేసుకోలేక సతమతమవుతున్నారు, అన్నిటినీ మించి- ఎటువంటి సర్దుబాట్లు రాజీలు అమెరికన్‌ సమాజంతో పూర్తి ఐక్యతను తెచ్చిపెడతాయో- అదే సమయంలో తమ ప్రత్యేకతలను పరిరక్షిస్తాయో వారికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆ సంక్షోభం, అయోమయం, ప్రయాణం, తర్జనభర్జన- అన్నీ ఈ కథలలో కనిపిస్తాయి.

తలిదండ్రుల మీద, స్వదేశం మీద బెంగ ప్రకటించే కథలు ఇందులో రెండు మూడు ఉన్నాయి. అమెరికా- ఇండియా స్త్రీ జీవితాన్ని పోల్చి చూసే కథలూ ఉన్నాయి. అమెరికా సమాజంలో భాగమైపోయి- అక్కడి సామాజిక సమీకరణలలో తమ స్థానం గురించి ఎంతో రాజకీయ స్పృహతో ఆలోచించి రాసిన కథ ఎస్‌. నారాయణస్వామి 'తుపాకీ', భారతీయులకు అమెరికన్‌ నల్లవారికీ మధ్య మైత్రి సహజమని చెబుతూ అమెరికన్‌తో స్నేహానికి వెంపర్లాడి నల్లవారిని నిర్లక్ష్యం చేయడంలో ఉన్న ప్రమాదం గురించి ఒక పాఠశాల నేపథ్యంలో ఈ కథ చిత్రిస్తుంది. రాజకీయ సందేశానికి ప్రథమ పరిగణన ఇస్తే కనుక ఈ కథ ఈ సంకలనానికి హైలెట్‌. కథనం రీత్యా అయితే- పుచ్చా అన్నపూర్ణ పెళ్లి కథ, శైలీ కథాగమనం రీత్యా అయితే వంగూరి చిట్టెన్‌రాజు అమెరికా మజిలీ వాహనయోగం, వేలూరి వేంకటేశ్వరరావు 'మెటామార్ఫసిస్‌' చెప్పుకోదగ్గ కథలు. మారుతున్న భారతదేశాన్ని విదేశాంధ్ర స్త్రీ ఎలా చూస్తుందో 'పాలన' రాసిన 'జానకత్త జంబూ ద్వీప యాత్ర' ఏక పాత్ర సంభాషణ ప్రధానంగా వివరిస్తుంది. సంస్కృతిలో వస్తున్న మార్పులను గమనించిన పద్ధతి ఈ కథలో విశేషమైనది.

డయాస్పోరా నుంచి పుట్టే సాహిత్యం రెండు సందర్భాల, రెండు సమాజాల, రెండు సంస్కృతుల సంపర్కం నుంచి, స్పర్శ నుంచి పుట్టేది. ప్రవాసులు ఎంతగా హోమోజినైజ్‌ చేద్దామనుకున్నా- భారతీయ సంస్కృతి కానీ, తెలుగువారి సంస్కృతి కానీ 'ఏకైకం' కావు. ఫలానా ప్రాంతం నుంచి వెళ్లిన తెలుగువారికి అమెరికాతో లేదా అమెరికాలోని ఒక సంస్కృతితో కలిగే స్పర్శా, మరొక తెలుగు ప్రాంతం నుంచి అమెరికా వెళ్లినవారికి కలిగే స్పర్శా- ప్రభావంలో ఒకటిగానే వుండవు. ప్రాంతమే కాదు, స్త్రీలకు పురుషులకు, వివిధ సామాజిక వర్గాలకు- అంటే కులాలకు, ఇప్పటి సందర్భంలోనైతే మరీ ఎక్కువగా మతాలకు మధ్య డయాస్పోరా తేడా వుంటుంది. ఈ కథా సంకలనంలో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి కథకులు ఒకరిద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ఆ ప్రాంతాల నుంచి అమెరికాకు జరిగే ప్రవాసం అతి తక్కువ కావడమో, వారిలో ఇటువంటి ఐడెంటిటీ కోసం తపించేవారు, సాహిత్య మార్గానుయాయులు తక్కువ కావడమో ఇందుకు కారణం అయి వుండాలి. ఆయా ప్రాంతాల వారు అమెరికాతో సంబంధంలోకి వచ్చినప్పుడు- ఆ ఇంటర్‌ యాక్షన్‌ కూడా విభిన్నమైన సాహిత్య సృజనకు ఆస్కారమిస్తుంది. స్వదేశంలో అసమానతలున్న అస్తిత్వాల నుంచి వచ్చినవారి మధ్య అమెరికాలోని ఇంటర్‌ యాక్షన్‌ కూడా అనేక కొత్త సృజనలకు ఆశ్రయమవుతుంది. ఇటీవలి వెల్లువలో అమెరికాకు వెళ్లినవారిలో సామాజిక, ప్రాంతీయ వైవిధ్యం ఎక్కువగా ఉన్నది. వారి నుంచి వచ్చే (వస్తే కనుక!!) సాహిత్యం తప్పకుండా భిన్నంగా ఉండే అవకాశం ఉన్నది.

పుస్తకానికి రాసిన ముందు మాటలో చిట్టెన్‌ రాజు- తమ అమెరికా ప్రవాసం సాఫల్య వైఫల్యాల గురించి ఒక ప్రశ్న వేసుకున్నారు. ఆ ప్రశ్నలో పెద్ద విశేషం ఏమీ లేదు కానీ- ఆ ప్రశ్న వేసుకోవాలనిపించే సందర్భమే విశేషమైనది. అటువంటి ఒక సింహావలోకనపు సదసత్సంశయం- ఎంతో శోధనకు, మథనకు ఆస్కారమిస్తుంది. అమెరికన్‌ సమాజం తనను తాను నిర్వచించుకుంటున్నప్పుడు- ఆ 'తాము'లో భారతీయులు ఎంత మేరకు ఉన్నారో, ఉన్నా వారి ప్రతిపత్తి ఏమిటో శ్రద్ధగా గమనించవలసిన తరుణం ఇది. ఈ పుస్తక ఆవిష్కరణ సమయంలో మాట్లాడుతూ ఆయన- తెలుగు సాహిత్యంలో ఈ కథలను ఒక భాగంగా చూడాలని అభ్యర్థించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారి కథలు కూడా తెలుగు సాహిత్యంలో ఒక భాగమే. ఆ స్థానం ఒకరిచ్చేది కాదు. అయితే, సంపన్న దేశాలకు వెళ్లి స్థిరపడినంత మాత్రాన సాహిత్యం మీద నిర్ణాయక అధికారం వుండాలని కోరుకోవడం మాత్రం విదేశాంధ్రులకు తగదు. విదేశాంధ్ర సాహిత్యం ఒక పాయగా వుండవచ్చును, ప్రతిభా పాటవాల ఆధారంగా ప్రముఖ పాత్రలు కూడా పోషించవచ్చును కానీ- సాహిత్య పోషణ ద్వారా మాత్రం పెద్ద పీటను పొందాలనుకోవడం సరికాదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X