శ్రీనివాస్‌ బెత్తం ఎవరిపై?

Posted By:
Subscribe to Oneindia Telugu

తెలుగు సాహిత్య రంగంలో కె. శ్రీనివాస్‌ గమ్మత్తయిన సూత్రీకరణలు చేస్తూ వుంటారు. అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు, కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఒక్కోసారి అవి నాటుబాంబుల్లా పేలుతుంటాయి. తాజాగా 'ప్రజాతంత్ర' వర్తమాన సాహిత్య సంచిక 2002లో విచిత్రమైన సూత్రీకరణలు చేశారు. అదీ సంపాదకీయంలో. నిరుడు ఇదే పత్రిక సాహిత్య సంచికలో అటువంటి సూత్రీకరణ ఒకటి చేసి కొంత కాలం చర్చలో నలిగారు. కవిత్వం కేంద్ర స్థానం నుంచి తప్పుకుందని ఆయన అప్పుడు చేసిన సూత్రీకరణ. అది మంచిది కూడా అని ఆయన వ్యాఖ్యానిస్తారు. ఇటువంటి సందర్భాల్లో ఆయన ప్రవక్త పాత్ర పోషిస్తుంటారు.

కవిత్వానికి ప్రాధాన్యం తగ్గిందనేది ఆయన సూత్రీకరణ. కవిత్వం ప్రాధాన్యం తగ్గిందని ఆయన ఎందుకనుకుంటున్నారో అర్థం కావడం లేదు. విప్లవ సాహిత్య పాయ ఉధృతి తగ్గినందు వల్ల ఆయనకు అలా అనిపిస్తోందా? ఇటీవలి కాలంలో వచ్చిన కవిత్వం ఆయనకు కనిపించడం లేదా? ఆయన చూడలేదా? ఆయన అదే 'ప్రజాతంత్ర' రెగ్యులర్‌ సంచికల్లో ఒక్కో కవిని తీసుకుని వ్యాసాలు రాస్తున్నారు. అలా రాయడానికి తగినంత మంది కవులున్నారని ఆయన భావించబట్టే కదా, అలా రాయడానికి ఆయన ముందుకు వచ్చారు. సాంద్రతరమైన విప్లవేతర కవిత్వం, తెలంగాణ కవిత్వం వచ్చిన విషయం ఆయనకు తెలియదనుకోవాలా? ఇటీవలి కాలంలో ఎన్ని కవితా సంకలానాలు వచ్చాయో శ్రీనివాస్‌కు తెలియదా? ఇదంతా కవిత్వం కాకుండా పోతుందా? కవిత్వం రావడం లేదని చెప్పడానికే అన్నట్లు ఆయన పలుచని కవిత్వాన్ని 'ప్రజాతంత్ర' ప్రత్యేక సంచికలో వేశారు. స్త్రీల కవిత్వమే వేసి ఆయన చేతులు దులుపుకున్నారు. బహుశా, ఆయన ఎంపిక చేసుకున్న కవితల్లో కవిత్వం పాలు తక్కువగా వుండి వుంటుంది. అలా తక్కువగా వుండే విధంగా ఆయన జాగ్రత్త పడ్డారా? ఇదే సమయంలో అల్లం నారాయణ దీర్ఘ కవితను సంచికలో అచ్చేశారు. శ్రీనివాస్‌ ఏది మాట్లాడితే అది వాస్తవమైపోతుందా?

ఇక రెండో విషయం- 'ఇంత దాకా కథా రచయితలు ప్రచారానికి, ముఠా తత్వానికి దూరంగా ఉంటారని ఒక అభిప్రాయం ఉండేది. కవిత్వానికి ప్రాధాన్యం తగ్గి, కథ ప్రముఖ స్థానానికి రావడంతో- అన్ని అవలక్షణాలూ ఈ రంగంలోకి (ప్రక్రియలోకి అనాలేమో) కూడా ప్రవేశిస్తున్నట్టున్నాయి' అని ఆయన తన సంపాదకీయంలో అన్నారు. శ్రీనివాస్‌కు కథపై ఎంత మమకారం?! ఆయన దాంతో ఆగకుండా ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. 'కథా రంగం వైభవం కథగా మిగిలిపోకూడదు. కథ కవిత్వంగా మారిపోకూడదు. కవులలో ఉన్న అవలక్షణాలు కథకులలోకి రాకూడదు' అనేది ఆ హెచ్చరిక. ఈ మూడు వాక్యాలకు ఎవరైనా అర్థం చెప్పగలిగితే బాగుండు. ఆయన హెచ్చరికలు చదివి కథారచయితలు నత్తగుల్లల్లా ముడుచుకుపోవాలి. ఒక న్యూనతా భావంతో తల్లడిల్లాలి. ఆయన హెచ్చరికల ఉద్దేశం కూడా బహుశా అదే అయి వుంటుంది.

కథా రచయితల్లో ముఠాతత్వం ప్రవేశిస్తుందని శ్రీనివాస్‌కు ఎందుకనిపించిందో అర్థం కాదు. అయితే లోతుగా ఆలోచిస్తే మాత్రం ఒక జవాబు దొరికే అవకాశం వుంది. శ్రీనివాస్‌ కవిత్వానికి కాలం చెల్లిందని అనడానికి, కథా రచయితల్లో ముఠా తత్వం, అవలక్షణాలు చోటు చేసుకుంటున్నాయని అనడానికి గల కారణం ఒక్కటే అనిపిస్తోంది. తెలుగు సాహిత్యం మొదటి నుంచి కుమ్ములాటలతో అట్టుడికిపోతోంది. ఒక వర్గం దశాబ్దాల తరబడి తన గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. కొందరు పీఠాధిపతులు చెప్పిందే కవిత్వం, కథ అవుతూ వచ్చింది. దాన్ని బద్దలు కొడుతూ వారిని బేఖాతర్‌ చేస్తూ వాళ్ల ప్రమేయం లేకుండానే మంచి కవిత్వం వచ్చింది; వస్తోంది. ఇందుకు ఉదాహరణలు కావాలంటే మరోసారి ఇచ్చుకోవచ్చు. ఇంత వరకు కథా సాహిత్యంలో కొనసాగిన గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించి, ఎదిరించి నిలబడే కథా రచయితలు వచ్చారు; వస్తున్నారు. అటువంటి సందర్భంలో సహజంగానే ఘర్షణ మొదలవుతుంది. కథా సాహిత్యంలో ఆ ఘర్షణ జరుగుతోంది. కథా రచయితలు కూడా ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. మునుపటి లాగా కొంత మంది మాట ప్రకారం ఆ కొద్ది మందే కథా రచయితలంటే వినేవాడు లేడు. అందుకే, శ్రీనివాస్‌కు కథా రంగంలో (కథా ప్రక్రియ అని శ్రీనివాస్‌ అనలేదు) ముఠా తత్వం చోటు చేసుకుంటున్నట్లు, అవలక్షణాలు అలవరుచుకుంటున్నట్లు అనిపించడం సహజం.

అఫ్సర్‌, నందిని సిధారెడ్డి ప్రధానంగా కవులు. సాహిత్య రంగంలో వారికున్న గుర్తింపు కవులుగానే. వీరిద్దరి కథలను 'ప్రజాతంత్ర' సాహిత్య సంచికలో అచ్చేశాడు. కథా రంగంలో ముఠా తత్వం ప్రవేశిస్తోందనడానికి, అన్ని అవలక్షణాలు ఈ రంగంలోకి కూడా ప్రవేశిస్తుండడానికి ఇది నిదర్శనమా? ఒక రకంగా నందిని సిధారెడ్డి, అఫ్సర్‌లు మాత్రమే కాదు, స్కైబాబ, యాకూబ్‌, షాజహానా వంటి కవులు కూడా ఇవాళ్ల కథలు రాస్తున్నారు. కొంత మంది కవులు కథా ప్రక్రియలో చేయి పెట్టడం వల్లనే ఆ అవలక్షణాలు, ముఠా తత్వం ప్రవేశిస్తున్నాయమోనని శ్రీనివాస్‌ ఎందుకు ఆలోచించలేకపోయారు. "పోటీల కోసం పోటీ పడడం, కథా రంగంలో పెద్ద పీట కోసం ఎగబడటం, కథల ప్రచురణల కోసం, బహుమతుల కోసం పైరవీలు, లాబీయింగ్‌లు-" అని శ్రీనివాస్‌ మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి ఏ ఒక్క ప్రక్రియకో ఏదో ఒక కాలానికో పరిమితం కాదు. ఎప్పుడూ అన్ని ప్రక్రియల విషయంలో ఇది కొనసాగుతున్నదే. అయితే, శ్రీనివాస్‌ అలా కథా రచయితలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి ఇతరేతర కారణాలు ఉన్నాయని అనుకోవాల్సి వుంటుంది.

మొత్తంగా, మన విమర్శకులు బెత్తం పట్టుకుని కోదండం ఎక్కించడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుండే కాన్గీ బడి టీచర్లలాంటి వారనేది మరోసారి రుజువయింది. వారు చెప్పిందే పాఠం, వారు చెప్పిందే వాస్తవం. వారికి ఏది తోస్తే అదే అప్పటికి సత్యం. శ్రీనివాస్‌ ఈ ధోరణికి అతీతులేమీ కారని రుజువు చేసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X