వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం కవిత్వంపై 'మూడోకన్ను'

By Staff
|
Google Oneindia TeluguNews

"బ్రాహ్మణవాదం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రారంభించి ప్రచారం చేసింది వాళ్లే అయినప్పటికీ అది వారికే పరిమితమై లేదు. రాను రాను ఇతర హిందూ కులాలు, విదేశీ దండ యాత్రికులు, భారతీయ రాజులు దాన్ని సమర్ధించి తమ స్వంత ప్రయోజనాలకు వాడుకున్నారు. తద్వారా బ్రాహ్మణవాదం ఇప్పుడు వున్నంత శక్తివంతమైన వాదంగా ఎదగడానికి దోహదపడ్డారు. కులవ్యవస్థనీ, పౌరోహిత్య క్రతువులనూ అందరు దోపిడీదారులు ఉపయోగించుకున్నారు"

"భారతీయులు తమ రాజకీయ స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన తర్వాత బ్రాహ్మణవాదాన్నే తమ మతంగా, సంస్కృతిగా ఆమోదించక తప్పని స్థితికి వచ్చారు. దాని అన్యాయాలకూ, దాని అసత్యాలకూ తమను అర్పించుకొన్నారు."

"రామాయణం ఎంతగా హృదయాలను స్పృశించేదిగా వున్నప్పటికీ దాన్ని తమ మత గ్రంథంగా అంగీకరించడానికి ఏ హిందువైనా సిగ్గుపడుతాడు."

"బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం సైతం మార్పుకు గురవుతుంది కానీ బ్రాహ్మణ సామ్రాజ్యవాదం మాత్రం అంతే క్రూరంగా వుంది."

"బ్రాహ్మణవాదం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకూ హిందూ ప్రజానీకాన్ని, నైతికంగా, మేధోపరంగా నిర్వీర్యులని చేసి, హిందూ జాతిని నీచత్వంలోనూ, అనైక్యతలోనూ జీవించి మరణించేట్టు చేసి నిజమైన మతాన్ని క్రతువుల వరదలో ముంచెత్తి హిందూ భక్తులను దారుణమైన దోపిడీకి గురి చేసింది."

- స్వామి ధర్మతీర్థ (హిందూ సామ్రాజ్యవాద చరిత్ర, 1941)

స్వామి ధర్మతీర్థ చెప్పిన హిందూ మతానికి లేదా ధర్మానికి ఇప్పుడు హిందూ మతంగా చెలామణి అవుతున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదు. బ్రాహ్మణవాదం హిందూ ప్రజలను అంటే భారతీయులను ఎలా అనైక్యతలోకి నెట్టిందో, తమ భోగలాలసత్వం కోసం, వ్యక్తిగత లాభార్జన కోసం సమాజాన్ని ఎలా కులాలుగా విభజించిందో, పాలకుల చేతా, ప్రజల చేతా నయాన్నో, భయాన్నో ఏ విధంగా తమ వాదాన్ని అంగీకరింపజేసి పబ్బం గడుపుకుంటూ వచ్చిందో స్వామి ధర్మతీర్థ వివరంగా విశదీకరించారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడిన శ్రీరాముడ్ని బ్రాహ్మణులు ఎలా లోబర్చుకున్నారనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు మనం హిందూ మతం అనుకునేది కొద్ది మంది బ్రాహ్మణుల మతంగా మొదలై మెజారిటీ ప్రజల మతంగా రూపుదిద్దుకుంది. ప్రజలు నేడు ఆరాధిస్తున్న రాముడు కూడా కొద్ది మంది బ్రాహ్మణుల దేవుడే తప్ప అశేష భారత (హిందూ) ప్రజల దేవుడు కాడు. కొన్ని వేల ఏళ్ల పరిణామక్రమంలో కొద్ది మంది బ్రాహ్మణుల మతం అశేష ప్రజానీకం మతంగా ఎదిగింది. ఈబ్రాహ్మణవాదాన్నే హిందూ మతంగా అంగీకరించే స్థితిలోకి భారతీయులందరూ నెట్టబడ్డారు. ఇవాళ్ల హిందూ మతమంటే బ్రాహ్మణవాదమే తప్ప మరోటి కాదు.

ఇవాళ్ల బ్రాహ్మణవాదం (కులం కాదు, ఒక విశ్వాసం) అన్ని కులాలవారి చేత తాము హిందువులమని ఏ ప్రమేయం లేకుండానే అంగీకరింపజేసే స్థితికి ఎదిగింది. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తులు ఎదురయినప్పుడు అన్ని కులాలవారిని హిందువుల పేరుతో ఎదుర్కునేందుకు సిద్ధం చేస్తూ, మిగతా సందర్భాల్లో దాదాపుగా అన్ని కులాలను దూరంగా వుంచే నీచ ఎత్తుగడను అవలంబిస్తోంది. ఈ స్థితిలో ముస్లింలను ఎదుర్కునేందుకు అది అన్ని కులాల భారతీయులను 'హిందూ జాతి' పేర సంసిద్ధం చేసే ఎత్తుగడను అనుసరిస్తూ వస్తోంది. రాజకీయం భారతదేశంలో ఎప్పుడూ బలహీనంగా వుంటూ వస్తోంది. ఈ హిందూ బ్రాహ్మణవాదులను ఎదుర్కుని ప్రజలందరినీ ఐక్యం చేసే శక్తి దానికెప్పుడూ లేదు. అందువల్లనే ఇప్పటికీ బ్రాహ్మణవాదం తన పట్టు బిగిస్తూ వస్తోంది.

స్కైబాబ కథ ఒకటి ప్రజాతంత్ర అనే పత్రికలో అచ్చయింది. ఈ కథ మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వుందంటూ ఈశ్వరానంద పేర ఒక రచయిత ఒకానొక పత్రికలో వ్యాసం రాశాడు. ఆ కథకే అతను పరిమితం కాకుండా కొన్నేళ్ల క్రితం విడుదలయిన 'జల్‌జలా' అనే కవితా సంపుటిపై కూడా విరుచుకుపడ్డాడు. ఇందులోని కొన్ని కవితలు హిందూ మతాన్ని తప్పు పట్టేవిగా వున్నాయనేది అతని ఆరోపణ.

నల్లగొండ నుంచి స్కైబాబ సంపాదకత్వంలో వెలువడిన 'జల్‌జలా' కవిత్వంపై దాడిని ఆ నేపథ్యంలోంచే చూడాల్సి వుంటుంది. స్కైబాబ 'ప్రజాతంత్ర'లో రాసిన కథను విమర్శించే సాకుతో ఈశ్వరానంద జల్‌జలాలోని కొన్ని కవితలపై కత్తులు దూసి 'బ్రహ్మానంద'పడిపోయాడు. నిజానికి, ఈశ్వరానంద ఉద్దేశం స్కైబాబ కథను తప్పు పట్టడం కాదు, 'జల్‌జలా' కవిత్వాన్ని దుయ్యబట్టడం అతని ఉద్దేశం. ముస్లింవాదులు తమ అస్తిత్వాన్ని లేదా ఐడెంటిటీని వెతుక్కోవడం అతనికి రుచించలేదు. బ్రాహ్మణవాద భావజాలానికి నిబద్ధులైన నిరంద్రియ మేధావులు ముస్లింవాద కవిత్వం పరిధులు దాటవద్దని 'లక్ష్మణరేఖలు' గీస్తుంటే, ఈశ్వరానంద వంటి పచ్చి కరుడు గట్టిన బ్రాహ్మణవాదులు 'ఫత్వాలు' జారీ చేస్తున్నారు. తన దాకా వస్తే గానీ తెలియదంటారు. కానీ, తన దాకా వచ్చినప్పుడు ఒక రకంగానూ, ఇతరుల దాకా వచ్చినప్పుడు మరో రకంగానూ ప్రవర్తించే లక్షణం తమకు ప్రత్యేక హక్కులను, అధికారాలను, స్వేచ్ఛను నిర్దేశించుకుని, అందరి చేత ఆమోద ముద్ర వేయించుకున్న బ్రాహ్మణవాదులకు రక్తంలోనే ఇమిడి పోయి వుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా వారి కాళ్ల దగ్గర దాస్యం చేయాల్సిందే.

బ్రాహ్మణవాదానికి పుట్టుకతోనే అత్యధిక సంఖ్యాక దళిత, బహుజనులు కట్టుబడిపోయారు. అయితే, దానికి కట్టుబడిపోనిది ముస్లింలే. కింది స్థాయిలో దళిత, బహుజనులు, ముస్లింలు సహజీవనం చేస్తూనే వున్నారు. ఒకరి మతం మరొకరికి ఎప్పుడూ సహజీవనానికి అడ్డంకి కాలేదు. ఇస్లాంను దళిత, బహుజనులు ఒక కులంగా చూశారే తప్ప మతంగా చూడలేదు. చిక్కంతా పట్టణ జీవుల నుంచి, నిరింద్రయ మేధావుల నుంచి వచ్చి పడుతోంది. ప్రజానీకం మనోభావాలను, అభిప్రాయలను నియంత్రించే సత్తా గల బ్రాహ్మణ మేధావులు ప్రాచీన కుట్రనే ఇప్పుడూ ప్రయోగిస్తున్నారు. దీనికి తోడు, విడివిడిగా వుంటూనే హిందూ ప్రజలు గొర్రెదాటు వ్యవహారంలా తమను బలపరచాలని బ్రాహ్మణవాదులు కోరుకుంటున్నారు. ఈ స్థితిలో తమకు పూర్తిగా లోబడిపోయి జీవిస్తున్న చిత్రకారుడు ఎం.ఎఫ్‌. హుస్సేన్‌లాంటివారి పట్ల వారు ఉదార దృక్పథం అవలంభిస్తారు. ముస్లింలు తమ మతంలోని ఛాందసవాదాన్ని ప్రశ్నించాల్సిందే గానీ హిందూ సమాజంలోని దాష్టీకాన్ని ప్రశ్నించకూడదనేది బ్రాహ్మణవాదుల అభిప్రాయం. ముస్లింల జీవితాలను ఇవ్వాళ్ల ఇస్లాం కన్నా బ్రాహ్మణవాదమే ఎక్కువగా నియంత్రిస్తోంది. ఈ కారణంగా వారు ప్రధానంగా బ్రాహ్మణవాదాన్ని ప్రశ్నించాల్సిన అనివార్యతలో చిక్కుకున్నారు. ఈ దృష్ట్యా ముస్లిం కవులు తప్పకుండా హిందూ మతాన్ని తృణీకరించడమో, వ్యతిరేకించడమో చేయకతప్పదు. ఆ పనే జల్‌జలా కవులు చేశారు. ఇదిలా వుంటే, ముస్లింలు దారుణమైన వివక్షకు గురవుతున్నారు. ముస్లింలు కూడా ఈ దేశానికి సంబంధించిన వాళ్లనే విషయాన్నీ తమకు తెలియకుండానే కింది కులస్థుల నుంచి పై కులస్థుల వరకు అంగీకరించని పరిస్థితిని కల్పించి పెట్టారు. అందుకే, తమకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, తమకు ఎదురవుతున్న కష్టాల పట్ల ఆగ్రహం ప్రకటిస్తే అది విచ్ఛిన్నకర ధోరణి అవుతుంది; మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమవుతుంది. రాజ్యం అదుపు చేయడానికి ఉపయోగించే చట్టాల కన్నా భారతదేశంలో బ్రాహ్మణ మేధోజనితమైన 'విలువల చట్రానికే' బలం ఎక్కువ. ఈ విలువల చట్రం నుంచే 'జల్‌జలా' కవులను ప్రశ్నిస్తున్నారు. ఈ విలువలను బద్దలు కొట్టడమే ఇప్పుడు చేయాల్సిన పని. ఆ పని కొంతలో కొంతయినా జల్‌జలా కవులు చేశారు. అందుకే, జల్‌జలా కవులపై అంత అసహనం, అంత విసుగు, అంత ఆగ్రహం.

'జల్‌జలా' కవులు తమ మతంలోని ఛాందసవాదాన్ని గట్టిగానే ప్రశ్నించారు. మతం పేర అమలవుతున్న అణచివేతనూ ప్రశ్నించారు. ముస్లింలు ఈ అణచివేతను, ఛాందసవాదాన్ని ప్రశ్నిస్తూ పోతే బ్రాహ్మణవాదులకు పరోక్ష లాభం చేకూరుతుంది. వీరి వాదనలను ఉంటంకిస్తూ తాము విస్తరణ కాంక్షను ఆచరణ రూపంలో పెట్టడానికి గొప్పగా ముందుకు దూకుతారు. అందుకే, భారతీయ జనతా పార్టీ (బిజెపి)లోని ముస్లింలను మిగతా ముస్లింల ముందు ఆదర్శవంతులుగా చూపుతారు. ప్రాచీనకాలంలో రాజులను శాసించినట్లు ఇవ్వాళ్ల బిజెపిని ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర సంఘ్‌ పరివార్‌ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. (బ్రాహ్మణవాదాన్ని అంగీకరించిన దశరథుడ్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించే మునుల మాదిరిగా) ఇస్లాం మత ఛాందసవాదాన్ని జల్‌జలా కవులు ప్రశ్నించకుండా వుండి వున్నట్లయితే వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా వుండేదో! ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎక్కువగా తమ మత ఛాందసవాదాన్ని, అణచివేతను ప్రశ్నించారనుకోవాలా?

ఇదిలావుంటే, కొన్ని సందర్భాల్లో కవిత్వం ఆగ్రహ ప్రకటన మాత్రమే అవుతుంది. కవిత్వంలో కొన్ని సార్లు కార్యకారణ సంబంధాలు వ్యక్తం కావాలనడం కూడా అర్థరహితమే. కవిత్వాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి చూసినప్పుడు ఒక రకంగానూ, మొత్తాన్ని కలిపి చూసినప్పుడు మరో రకంగానూ అర్థమవుతుంది. బ్రాహ్మణవాదులు భారత సమాజాన్ని కులాలుగా విభజించినట్లు, కవిత్వాన్ని కూడా ముక్కలు ముక్కలుగా విడగొట్టి చూడదల్చుకున్నప్పుడు విద్వేషపూరితంగానే కనిపిస్తుంది. నిజానికి, ఇలా చెప్పడంలోనే పెద్ద కుట్ర దాగి వుంది. ముక్కలు ముక్కలుగా కవిత్వాన్ని విడగొట్టి పాఠకుల ముందు పెట్టి సమాజాన్ని మరింత ముక్కలుగా విడగొట్టి తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే తత్వం వారికి సహజంగానే వుంది. ఆ సహజ గుణాన్నే వారు ప్రదర్శిస్తారు.

కవిత్వం విషయానికి వస్తే, ముందే అనుకున్నట్లు ఆధునిక కవిత్వం చాలా సార్లు, మరీ ముఖ్యంగా, అణచివేతకు, వివక్షకు గురవుతున్నప్పుడు ఆగ్రహంగానే వెలువడుతుంది.ఆ ఆగ్రహం నుంచి అకవిత్వంగా కవిత్వం వెలువడుతుంది. ఇది గుణమే గాని దోషం కాదు. సందర్భాన్ని బట్టి కూడా భావవ్యక్తీకరణ వుంటుంది. ఈ సందర్భం నుంచి విడదీసి కవిత్వాన్ని చూడడం కూడా సరి కాదు. సందర్భాన్ని కవిత్వం నుంచి విడదీసి సాధారణీకరించాలనుకుంటే పెద్ద ముప్పే వాటిల్లుతుంది. ఆ సాధారణీకరణించడమనేది కూడా బ్రాహ్మణవాదపు కుచ్చిత బుద్ధే. ఈ విధమైన బ్రాహ్మణవాదానికి రాముడ్ని 'చెట్టుచాటు ధోకేబాజ్‌' అనడం ద్రోహంగానే కనిపిస్తుంది. 'త్రేతాయుగం నుంచి బాబ్రీ శకలాల దాకా/ శవాల మీంచి నడిచి వచ్చిన రాముడు/ నాస్తికుడికైనా నాకైనా రాకాసే' అంటే ఎందుకు తప్పు వచ్చిందో అర్థం కాదు.

జల్‌జలా కవులే కాదు, హిందూ రచయితలు పలువురు ఇంత కన్నా దారుణంగా రాముడి గురించి రాశారు. అవేవీ వీరి కంటికి ఆనవు. ఎందుకు? వారు హిందువులే కాబట్టి. చెడిపోయిన పిల్లవాణ్ని తలిదండ్రులు క్షమించి వదిలేసినట్లు వదిలేస్తారు. కొన్ని సందర్భాల్లో బెదిరిస్తారు; దాడులు చేస్తారు; అధికారం ప్రయోగిస్తారు. అంతకు మించి వారిక ఫత్వాలు జారీ చేయరు. ముస్లింలు ప్రశ్నించే సరికి ఎవరో బయటివారు తమ 'కుటుంబం'లో తలదూర్చినట్లు తెగ రెచ్చిపోతారు. ఫత్వాలు జారీ చేస్తారు. మత విద్వేషకులని ముద్రలు వేస్తారు. నిజానికి, జల్‌జలా కవులు ఏ మతాన్నీ ఉన్నదున్నట్లుగా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. వారు ఓ తాత్వికతను తమ కవిత్వం ద్వారా అందించారు. ఈ సామాజిక తాత్వికత నిజానికి బ్రాహ్మణవాదులకు మింగుడు పడదు.

ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో బతుకుతున్న ముస్లింలను ఈ సమాజానికి చెందినవారిగా బ్రాహ్మణవాదులు, లేదంటే హిందువులు గుర్తించ నిరాకరిస్తున్నారు. ముస్లింలకు కూడా ఇక్కడ జీవించే హక్కు వుందని వారు మనఃపూర్వకంగా విశ్వసించడం లేదు. పరాయి దేశస్థులుగానే చూసే మనస్తత్వం తెలియకుండానే మెజారిటీ ప్రజలకు అలవడిపోయింది. ఈ కారణంగా తాను ఈ దేశానికి చెందినవాడినే అని ప్రకటించుకోవడానికి, తన హక్కులను పొందడానికి, హిందువులతో సమానంగా అవకాశాలను రాబట్టుకోవడానికి తనకు అడ్డుగా వున్నవాటిపై ముస్లిం ఆగ్రహం వ్యక్తం చేయాల్సిందే. జల్‌జలా కవులు చేసిందదే. దేవుడినైనా ధిక్కరించే ధైర్యం కవికి వుంటుంది; వుండాలి కూడా. తమకు అడ్డుగోడగా నిల్చిన బ్రాహ్మణాధిపత్యాన్ని దళిత, బహుజనులు ప్రశ్నిస్తున్నారు. జల్‌జలా కవులు కూడా దళిత, బహుజనలు వేసిన ప్రశ్నలే మరో రూపంలో వేస్తున్నారు. దళిత, బహుజనులతో మమేకతను ప్రదర్శిస్తున్నారు. జల్‌జలా కవులు బ్రాహ్మణిజం ఆధిపత్య ధోరణిని ప్రశ్నిస్తూనే, తమ మతంలోని దాష్టీకంపై దాడి చేశారు.

చివరగా మళ్లీ స్వామి ధర్మతీర్థ మాటలే- "హిందువులు, ముస్లింల మధ్య గానీ, హిందువులకు, మరో ఆత్మగౌరవం వున్న జాతికి మధ్య గానీ సరైన అవగాహన కుదరాలంటే హిందువులు బ్రాహ్మణవాద సామాజిక నిర్మాణాన్ని వదులుకొని ప్రజాస్వామిక సూత్రాలతో సమాజాన్ని నిర్మించుకుంటేనే తప్ప అది కుదరని పని."

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X