వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచమెరిగిన కవిత్వం

By Pratap
|
Google Oneindia TeluguNews

Annavaram Devender
''నా బాల్య జ్ఞాపకం/ నేను/ బాలశిక్షలో దాచుకున్న నెమలికన్ను వంటిది'' అని కవిత్వం 'తొవ్వ' పట్టిన అన్నవరం దేవేదర్‌ 'ఎదురుదాడిలో పారిన నెత్తురు/ పెనుగులాటలో చినిగిన అంగి' నా కవిత్వం అంటూ 'నడక' మొదలుపెట్టాడు. అలా మొదలు పెట్టిన దేవేందర్‌ నడక కరీంనగర్‌లోని 'మంకమ్మతోట లేబర్‌ అడ్డా' వద్ద ఆగింది. అలా ఆగి చూస్తే ఏముంది? చాలా తెలిసిన ముఖాలే కనిపించాయి. అలా కనిపించిన ముఖాలను చూసి అతను వలవలా ఏడ్చాడు. ఆ ఏడుపులోంచి, ఆ ఏడుపుకు కారణమైన శక్తులపై పుట్టి ఆగ్రహంలోంచి అతని కవిత్వం వెలువడింది. ఈ ప్రయాణం వల్ల దేవేందర్‌లో అవగాహన పెరిగింది. ఆ కారణంగా దేవేందర్‌ కవిత్వంలో సారం, సాంద్రత పెరిగాయి. 'మంకమ్మతోట లేబర్‌ అడ్డా' దాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. తెలంగాణ కవుల ప్రాపంచీకరణ దృక్పథాన్ని మంకమ్మతోట లేబర్‌ అడ్డాలోని కవిత్వం స్పష్టంగా వెల్లడిస్తుంది. తెలంగాణ కవిత్వం సంకుచితం కాదని, తెలంగాణ కవుల అస్తిత్వ వేదన సంకుచిత దృక్కోణం కాదని, కరుడు గట్టిన జడవాదాలను చీల్చుకుని విశాల దృక్పథాన్ని ప్రదర్శిస్తుందని, స్పష్టమైన విశాల అవగాహనూ కార్యాచరణనూ కర్తవ్యాన్నీ ప్రతిబింబిస్తుందనీ దండోరా వేసి చెప్పడానికి దేవేందర్‌ 'మంకమ్మతోట లేబర్‌ అడ్డా' వీలు కల్పిస్తుంది. 'విస్తరిస్తున్న విశ్వీకరణ/ ప్రాంతీయాత్మే ప్రతిఘటన' అనే విశ్వజనీన సత్యాన్ని తెలంగాణ కవులు సంతరించుకున్నారు. ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ ఆలోచనలు, దేశీయ దృక్పథం తప్ప ప్రపంచీకరణను ఎదుర్కొనే సాధనం మరోటి లేదు. చిత్తశుద్ధి, విశాల దృక్పథం వుంటే తప్ప ఈ విషయం అర్థం కాదు. కుందేటికి మూడేకాళ్లంటూ సాగే గతానుగతిక విధానాలు పనికి రావనే ఎరుకను తెలంగాణకవి పొందాడు. ఆ ఎరుకే అన్నవరం దేవేందర్‌ 'మంకమ్మతోట లేబర్‌ అడ్డా' కవితాసంకలనంలో కనిపిస్తుంది.

పలు వృత్తులకు చెందిన గ్రామీణులతో పాటు రైతు కూడా పుట్టిన మట్టి పొత్తిళ్లకు దూరమై, కూలి కోసం అడ్డా మీద నిలబడాల్సిన దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులకు కారణమైన శక్తుల గురించి 'మంకమ్మతోట లేబర్‌ అడ్డా' కవితలో చెప్పాడు. ఇది దేవేందర్‌ సమాజాన్ని నడిపిస్తున్న శక్తుల గురించిన అవగాహనను, అతని ప్రాపంచిక దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రాపంచిక దృక్పథంతోనే దేవేందర్‌ తన కవిత్వాన్ని సార్వజనీనం చేశాడు. తెలంగాణలో జరిగిన ప్రతీ సంఘటనకు వెనక గల శక్తులేవో పసిగట్టే నేర్పును ఆ దృక్పథం అందించిందని వేరుగా చెప్పనక్కర్లేదు. నక్సలైట్లు ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరం గురించి, చర్చల సమయంలో తెలంగాణలో నెలకొన్న ప్రశాంత వాతావరణ గురించి, ఇదే సమయంలో రాజ్యం ప్రవృత్తి గురించి, తుపాకులు మళ్లీ మొరిగిన తర్వాత ఏర్పడిన పరిస్థితి గురించి దేవేందర్‌ రాసిన కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఈ సంఘటనలను కవిత్వీకరించిన సందర్భాలు వేర్వేరు. ఈ కవిత్వాలను ఒకే చోట, ఒకేసారి చదివినప్పుడు ఏ విధమైన వైరుధ్యాలు కనిపించవు. కవి అవగాహనకు, ఆ అవగాహనను జీవితంలో భాగం చేసుకున్న తీరుకు ఇది నిదర్శనం. తెలంగాణ కవుల స్పష్టమైన, నిర్దుష్టమైన అవగాహనకు దేవేందర్‌ కవిత్వం అద్దం పడుతుందనడానికి దీన్ని కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రపంచీకరణకు, అంతర్గత వలసాధిపత్యానికి, పాలకుల నీతికి వ్యతిరేకంగా సాగే పోరాటదిశను తెలంగాణ కవి ఇవాళ నిర్దేశిస్తున్నాడు.

తెలంగాణ ప్రస్తుత స్థితికి దేవేందర్‌ కవిత్వం చిత్రిక కడుతుంది. 'ఇప్పుడు సూడవోతే/ సందుగ తాళం అనుం శెడిపోయింది' అంటున్న దేవేందర్‌ కవిత్వం తెలంగాణ తాళాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తుంది. 'నీళ్లంటే కండ్లల్ల నీళ్లే..' అయిన తెలంగాణ జీవన చిత్రాన్ని మన ముందుంచి 'బల్ల గుద్దుడే గల్లపట్టుడే గెదుముడే/ కుండ పల్గొట్టినట్టు కుల్లం కుల్లం' అని చెప్పి తీరుతాడు. తెలంగాణ వెనకబాటు గురించి, దుస్థితి గురించి, రాజ్యం హింస గురించి తెలంగాణ కవి మాట్లాడినంత సేపు అందరూ వంత పాడతారు. కానీ ప్రస్తుత తెలంగాణ దుస్థితికి గల కారణాలేమిటో, తమకు కావాల్సిందేమిటో చెప్పినప్పుడు వారికే చేదుమాత్ర మింగినట్లు ఉంటుందనే సత్యం తెలంగాణకవి అనుభవ పూర్వకంగా గ్రహించాడు. అయితే గత యాబై యేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల మనుగడనే ప్రశ్నార్థకం చేసిన వైనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు పోరుబాటు పట్టడానికి కల్పించిన అనివార్య స్థితి ఏమిటో, అందుకు కారకులెవరో అర్థం అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలనే కనీస ఆలోచన కూడా చాలా మంది తెలంగాణేతరులకు రావడం లేదు. ఎవరికో రాకపోతే సరిపెట్టుకోవచ్చు కానీ కోడి కూత కన్నా ముందే మేల్కొనే కవులు 'కువ్వారం' పడితే ఏమనుకోవాలి? ఆ కువ్వారం గురించి కూడా దేవేందర్‌ ధైర్యంగానే మాట్లాడాడు. ప్రపంచంలోని సకల అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడే తెలంగాణేతర తెలుగుకవులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరు విప్పరని అతను అడుగుతున్నాడు. 'కండ్లు లేనోల్లు చూసినా/ అధర్మం కండ్ల మెరుస్తుంది/ ఎవ్వలు చేసినా/ అన్యాయం అన్యాయమే కదా' అని దేవేందర్‌ అంటున్నాడు. ఈ కవితను ఎవరెట్లా స్వీకరిస్తారనేది వారి వారి సంస్కారాన్ని బట్టే వుంటుంది.

దేవేందర్‌ కవిత్వం స్పష్టంగా తెలంగాణ విభజననే కోరుకుంటున్నాడు. ఆ విభజన అవసరాన్ని, ఆ అవసరం ఏర్పడడానికి గల పరిస్థితులను, తన ఆకాంక్షలోని సామంజ స్యాన్ని, హేతుబద్ధతను అతను సూటిగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా పలుకుతున్నాడు. దేవేందర్‌ కవిత్వాన్ని సానుభూతితో చదివితే తెలంగాణ ప్రజలు పడుతున్న ఆరాటం, చేస్తున్న పోరాటాలు అర్థమవుతాయి. తెలంగాణను వ్యతిరేకించేవారికి అటువంటి సానుభూతి ఏ కొంచెమైనా వుంటే సమస్య ఎప్పుడో పరిష్కారమై వుండేది. అసలు ఈ సమస్యే వచ్చి వుండేది కాదు.

తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమానికి నారు పోసి, నీరు పోసి పెంచే ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి. ఈ సమయంలో భాష గురించి కూడా దేవేందర్‌ తన కవిత్వంలో మాట్లాడాడు. భాష పట్ల తెలంగాణ కవులకు స్పష్టమైన అవగాహన ఉందనడానికి దేవేందర్‌ కవిత్వంలోని బాషకు సంబంధించిన అంశాలే నిదర్శనం. భాషా పరిరక్షణకు, జీవనోపాధికి మధ్య ఉండే విడదీయరాని సంబంధాన్ని, తెలుగు భాషా పరిరక్షణకు అనుసరించాల్సిన విధానాల గురించి ఎన్‌. గోపి తన 'అక్షరయానం'లో ఆచరణయోగ్యమైన, అనుసరణీమైన మాటలెన్నో చెప్పారు. ఈ మాటలను తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమకారులు ఏ మేరకు పట్టించుకున్నారో, ఏ మేరకు అర్థం చేసుకున్నారో తెలియదు. వీటిని అర్థం చేసుకున్నవారు తమ భాషా పరిరక్షణకు తెలంగాణ కవులు ఎప్పుడో పూనుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. అదే సమయంలో తెలంగాణకు భాషా పరిరక్షణకన్నా ముందు కావాల్సిందేమిటో అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకున్నప్పుడు దేవేందర్‌ కవిత్వాన్ని, భాషకూ మనుగడకూ మధ్య గల స్వామ్యాన్ని, వైరుధ్యాలను తెలుసుకోగలుగుతారు. తెలంగాణ నేలనేలంతా దుమ్ము కొట్టుకుపోతుంటే, రక్తంతో తడిసి ముద్దవుతుంటే, అన్యాయాల బండి చక్రాల కింద నలిగిపోతుంటే, అనేకానేక సమస్య వలయంలో విలవిలలాడుతుంటే తెలంగాణ మేధావులు 'భాష'ను రక్షించుకోమనే పిలుపు కోసం కాలికి బలపం కట్టుకుని ఎలా తిరుగుతాడు? నిజానికి తెలంగాణ భాషకు ఇప్పుడు వచ్చిన ముప్పేం లేదు. అంతర్జాతీయ, అంతర్గత ఆధిపత్యాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తెలంగాణకవులకు భాష కూడా ఒక సాధనం. అందువల్ల తమ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా తెలంగాణకవులు భాషా పరిరక్షణ కర్తవ్యాన్ని కూడా నెరవేరుస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భాషనే కాదు, జానపద కళారూపాలు ఇంకా బతికే ఉన్నాయి. తెలంగాణ మేధావులు ఇప్పుడు రక్షించుకోవడానికి ప్రయత్నిం చాల్సింది జానపద కళారూపాలను. ఈ ప్రయత్నంలో వెనకబడితే ఈ కళారూపాలు మనకు దక్కకుండా పోయే ప్రమాదం ఉంది.

ఇక చివరగా, దేవేందర్‌ కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి తెలంగాణ భాష ఎక్కడా అడ్డం రాదు. కవికి స్పష్టమైన అవగాహన ఉంటే కవిత్వం కూడా స్పష్టతను సంతరించుకుంటుందనడానికి దేవేందర్‌ కవిత్వం ఉదాహరణ. అటువంటప్పుడు భాష అర్థసంక్లిష్టతకు దారి తీయదు. కవికి స్పష్టత లేకుంటేనే కవిత్వం సంక్లిష్టంగా మారుతుంది. ఆ సంక్లిష్టతకు భాష కారణమనే అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది. స్పష్టమైన దేవేందర్‌ అవగాహన కవిత్వానికి కూడా స్పష్టతను చేకూరుస్తుంది.

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
A prominent poet in Telugu literature, Annavaram Devender poetry reflects the human philosophy in a right direction. He uses Telangana dialect in his poetry without any effort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X