వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కవిత్వంలో వస్తు మార్పిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srisri
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. దీన్ని బట్టి కవిత్వానికి ఏదైనా వస్తువు అవుతుంది. కవిత్వానికి వస్తువు అనుభూతి కావచ్చు. ఒక వర్గానికి, మరో వర్గానికి మధ్య శత్రుపూరిత సంబంధం కావచ్చు, కవికీ సమాజానికీ మధ్య జరిగే సంఘర్షణ కావచ్చు, కవిలో జరిగే అంతస్సంఘర్షణ కావచ్చు, ఒక సామాజిక వర్గానికి, మరో సామాజిక వర్గానికి మధ్యగల సామాజిక అంతరాలు కావచ్చు. వస్తువు లోకాధీనం, కాలాధీనం, రచయిత హృదయ భావన. అంటే కవితా వస్తువు అనంతమైందనేదిగా మనం అర్థం చేసుకోవాలి. వస్తువుకు, ఇతివృత్తానికి మధ్య తేడా తెలియక చాలామంది కొట్టుమిట్టాడుతుంటారు. వస్తువు ముడిసరుకు అయితే, దాన్ని శిల్పంగా మార్చడానికి వాడే ఇతరేతర కవిత్వ పరికరాలతో కలిపి అది ఇతివృత్తమవుతుంది. వస్తువు కేంద్రమైతే, దాన్ని కళాత్మకంగా వ్యక్తం చేయడానికి అవసరమైన సామాగ్రి, వాతావరణం మొదలైనవి కలిపి ఇతివృత్తమవుతుంది.

కాగా, వస్తుగత బాహ్య వాస్తవికతకు సంబంధించిన మన భావనను ప్రముఖ విమర్శకుడు త్రిపురనేని మధుసూదనరావు వస్తువుగా చెప్పారు. కవి భావన అంటే కవి దృక్పథమని చెప్పుకోవచ్చు. ప్రముఖ పాశ్చాత్య విమర్శకుడు క్రిస్ట్ఫర్ కాల్డ్వెల్- వస్తుగత బాహ్య వాస్తవికతను సైన్స్ అన్నాడు. అంతర్గత వాస్తవికత కళ అవుతుందని చెప్పాడు. అంటే, ఇతివృత్తాన్ని కూడా కలిపి కాల్డ్వెల్ వస్తువుగా భావిస్తున్నాడని అనుకోవచ్చు. అలా చూసినపుడు వస్తువు అంటే మనకు కనిపించే పదార్థమే కాదు, దాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసే కవి దృక్పథం కూడా అని ప్రస్తుత కాలంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు తెలుగు కవిత్వంలో వస్తువు పరిణామక్రమాన్ని బేరీజు వేయడానికి వీలవుతుంది.
ప్రాచీన కవిత్వం నుంచీ భావకవిత్వం నుంచీ అభ్యుదయ వస్తువువైపు కవి దృష్టి మళ్లడం శ్రీశ్రీతో ప్రారంభమైందని అనుకున్నా దానికి ముందు కొంత కసరత్తు జరిగింది. ఒక వస్తువును వెనక్కి నెట్టి మరో వస్తువు కేంద్రంగా మారడానికి పాత వస్తువును నెగేట్ చేసే కవిత్వం వస్తుంది. అలాంటి సందర్భాల్లో అకవిత్వం కూడా కవిత్వంగా చెలామణిలోకి వస్తుంది. నిజానికి, అకవిత్వమే కవిత్వమవుతుంది. భావ కవిత్వాన్ని నెగేట్ చేస్తూ పఠాభి కవిత్వం వచ్చింది. భావ కవిత్వాన్ని తన వచన పద్యాలనే దుడ్డుకర్రలతో కొడతానన్నాడు. నేను భావకవిని కాను, నేనహంభావ కవిని అని ప్రకటించుకున్నాడు. అశ్లీలం అనుకునే పదాలతో కూడా అతను ప్రయోగాలు చేశాడు. అదే క్రమంలో శిష్ట్లా, నారాయణరావు కవిత్వాలు వచ్చాయి. శ్రీశ్రీ చేతిలో అభ్యుదయ కవిత్వం పూర్తిగా రూపుదిద్దుకుంది. అయితే, శ్రీశ్రీ కూడా పాత వస్తువును నెగేట్ చేసే పని పెట్టుకున్నాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమంటూ పాత వస్తు స్థితిని వ్యతిరేకించాడు. ఈ కవిత వస్తు మార్పిడి సూచిస్తుంది. మహాప్రస్థానం కవితలు అభ్యుదయ కవిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

సామాజిక పరిణామక్రమాలు కవిత్వంలో వస్తు మార్పిడికి దోహదం చేస్తాయి. అప్పటివరకు ఉన్న సామాజిక పరిస్థితులు, విలువలు మారినప్పుడు, మొత్తంగా సంపూర్ణ సామాజిక మార్పునకు అప్పటివరకు జరిగిన ఉద్యమాలు, పరిణామాలు సరిపోవనే భావన ఏర్పడినపుడు, లేదంటే కొత్త సామాజిక పరిణామాన్ని ఆధిపత్య వర్గాలు సంలీనం చేసుకున్నప్పుడు కవిత్వం వస్తువు మారాల్సి వస్తుంది. ఆ సంఘర్షణ నుంచి కొత్త వస్తువు రంగం మీదకి వస్తుంది. ముందే చెప్పినట్లు ఈ సంధి దశలో వస్తు మార్పిడికి ధిక్కార కవిత్వం దోహదం చేస్తుంది. అభ్యుదయ కవిత్వానికి ఆలంబనగా మారిన మార్క్సిస్టు ఉద్యమాలు నెహ్రూ సోషలిజాన్ని ఆలింగం చేసుకున్నాయి. పోరాట మార్గాన్ని వదిలేసి రాజీ మార్గాన్ని అనుసరించాయి. ఈ పరిణామం మనకు సాహిత్యంలో కన్నా తెలుగు సినిమాల్లో బలంగా కనిపిస్తుంది. మంచి జమీందారుకు, రైతు కూలీకి మధ్య సమన్వయాన్ని, సామరస్యాన్ని నెలకొల్పిన సినిమాలు అప్పట్లో చాలా వచ్చాయి. ఇటువంటి సందర్భంలో తెలుగు కవిత్వంలో వస్తు మార్పిడి అవసరం ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాట వైఫల్యం ఆ అవసరాన్ని మరింత తెలియజేసింది. ఆంధ్ర, హైదరాబాద్ విలీనంవల్ల తెలుగులో ఆ దశను చాలా ఆలస్యంగా పసిగట్టారని చెప్పవచ్చు. విశాలాంధ్ర ఏర్పాటుతో కలలోనైనా వాస్తవం కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చింది. అభ్యుదయవాదం పూర్తిగా పార్లమెంటరీ పంథాకు తీసిపోని రీతిలో ముందుకు రావడం తెలుగు కవిత్వాన్ని తీవ్రంగానే ప్రభావితం చేసింది. తెలుగు ప్రజలు భౌగోళికంగా కలిసిపోవడంవల్ల అభివృద్ధి, సాంస్కృతిక వికాసం, సామాజిక సమానత్వం సిద్ధిస్తుందనే భావనకు సామాన్య ప్రజానీకంతోపాటు మేధావులు, కవులు కూడా గురయ్యారు. అందుకే, తెలంగాణకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, కాళోజీ వంటివారు కూడా రెండు విభిన్న సమాజాల విలీనానికి సముఖంగా వ్యవహరించారు. అలాంటి సమాజం వస్తుందనే ఆశ తెలుగు కవిత్వంలో పాత వస్తువును నెగేట్ చేసే ప్రక్రియను జాప్యం చేసింది.
కలలూ ఆశలూ ఆశయాలూ కరిగిపోతున్న విషయాన్ని పసిగట్టి వారు ఈ సందర్భంలో దిగంబర కవులు మిగతా కవులకన్నా ముందుచూపున్నవారు మాత్రమే సంధి దశలోదాన్ని బద్దలు కొట్టడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పాత్రను పోషించినవారు దిగంబరకవులు. నన్నయ్యను నరేంద్రుడి బొందలో తోసియండి వంటి తీవ్రమైన వాక్యాలు దిగంబర కవిత్వంలో చోటుచేసుకున్నాయి. అభ్యుదయ కవిత్వాన్ని ప్రశ్నించే కవిత్వం నగ్నముని నుంచి వచ్చింది. వీరిలో కాస్తా దారి దొరికినవాడు చెరబండరాజు. వందేమాతరం కవితలో అది వ్యక్తమైంది. అది దారి కాదనుకున్నవారు ఆ సమయంలో బలమైన కవిత్వం రాసిన మహాస్వప్న తర్వాతి కాలంలో నిష్క్రియాపరుడు కావడానికి కవిత్వం సామాజిక పరిణామక్రమంలో ఉత్ప్రేరక పాత్ర వహిస్తుందని నమ్మకపోవడమే. దిగంబర కవిత్వం వినిపించిన ధిక్కార స్వరం నుంచి విప్లవ కవిత్వం ముందుకు వచ్చింది.

ఆ తర్వాత విప్లవ కవిత్వం జోరందుకుంది. అభ్యుదయ కవిత్వం బరిలో నిలచిన శ్రీశ్రీ విప్లవ కవిత్వ యుగంలోనూ అలానే నిలబడాలని ప్రయత్నించాడు. మహాప్రస్థానం, మరో ప్రస్థానం ద్వారా ఆయన విప్లవ కవిగా ముందుకు వచ్చాడు. ఇక్కడ దాదాపుగా నిబద్ధతకు, నిమగ్నతకు మధ్య విభజన రేఖ ఏర్పడింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించాలనే కవులు ఈ వైపు నిలిచారు. రాజకీయ నిర్మాణం కూడా ఏర్పడింది. దానికి ఆలంబనగా విప్లవ కవిత్వం మైదాన ప్రాంతం నుంచే కాకుండా అజ్ఞాతం నుంచి కూడా వెలువడింది. శ్రీశ్రీ విప్లవ కవిత్వానికి కూడా నాయకుడు కావాలని అనుకున్నాడు. కానీ విప్లవ కవిత్వానికి నాయకుడిని ఎంపిక చేయాలంటే శివసాగర్ మొదటి వరుసలో ఉంటాడు. శివసాగర్, అజ్ఞాతసూరీడు, కౌముది వంటి కవుల్లో విప్లవ సారం సృజనాత్మకంగా, కళాత్మకంగా వ్యక్తమైంది. వస్తువు అత్యంత బలమైన కళగా రూపుదిద్దుకుందని చెప్పాలి. ఈ రెండు కవిత్వాల హద్దులను చెరిపేయాలనే ప్రయత్నం చెరబండరాజులో కనిపిస్తుంది. విప్లవ కవిత్వంలో రెండు బలమైన పాయలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించి, విశే్లషించాల్సిన పని ఇంకా జరగాల్సే ఉంది. విప్లవ కవిత్వంలో పాట ఒక ప్రధాన ఆయుధంగా ఉంది. ఈ వ్యాసం వచన కవిత్వానికి మాత్రమే పరిమితమైంది కాబట్టి దాని గురించి ప్రస్తావించడం లేదు.

విప్లవ కవిత్వ వస్తువు ఒక సామాజిక పరిణామ దశలో మారాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంలో విపశ్యనకవులు ఆ అవసరాన్ని గుర్తించారు. ఫలితంగా అభ్యుదయ, విప్లవోద్యమాలు అందించినంత చైతన్యం స్ర్తిలలో, దళితుల్లో, ముస్లిం మైనారిటీల్లో కొత్త ఆలోచనలకు దారితీశాయి. లైంగిక, కుల వివక్షలను ప్రశ్నిస్తూ కొత్త వస్తువును ఇవి అందిపుచ్చుకున్నాయి. తొలుత ఈ కవిత్వాలు విప్లవ కవిత్వాన్ని ప్రశ్నించడంతో ప్రారంభమయ్యాయి. పాతదాన్ని తీవ్రమైన స్థాయిలో నెగేట్ చేస్తే తప్ప కొత్త వస్తువును స్థాపించడానికి వీలు కాదు. అందుకే, ఈ కవిత్వాలు తీవ్ర స్థాయిలో ముందుకు వచ్చాయి. తిట్లు, శాపనార్థాల రూపంలో వ్యక్తమయ్యాయి. దళిత కవిత్వంలో మనువు నోట్లో ఉచ్చ పోస్తా వంటి వ్యక్తీకరణలను కూడా మనం చూస్తాం. అలాగే, పైటను తగలెయ్యాలి వంటి వ్యక్తీకరణలుస్ర్తివాద కవిత్వంలో చూస్తాం. అటువంటి వ్యక్తీకరణలను వాచ్యార్థంలో తీసుకోవడంవల్ల అపార్థాలకు దారిశాయి. విప్లవం కవిత్వంలో తనను గుడికి రానీయకపోవడమే మంచిదైందంటూ సలంద్ర వంటి దళిత కవులు చేసిన వ్యక్తీకరణలు, ఆచరణలు దళిత కవిత్వంలో, దళిత ఉద్యమంలో మారిపోయాయి. అగ్రవర్ణాలవారిలాగే అన్ని చోట్లా, అన్ని సందర్భాల్లో సమాన హక్కులు, హోదా కావాలనే గుర్తింపు నుంచి, పోరాటం నుంచి దళిత కవిత్వం భిన్న పద్ధతిలో వ్యక్తమైంది. వస్తువు మార్పిడి స్పష్టంగా జరిగిపోయింది. స్ర్తివాద కవిత్వంలో కూడా పురుషుడితో సమానమైన హక్కులు, హోదా కావాలనే వ్యక్తీకరణలను చూస్తాం. ఒక రకంగా దళిత, స్ర్తివాద కవిత్వాలు రాజకీయోద్యమాలను సాంస్కృతికోద్యమం వైపు తిప్పే ప్రయత్నం చేశాయని చెప్పవచ్చు. రాజకీయోద్యమం మాదిరిగానే సాంస్కృతికోద్యమం స్వతంత్రం, సమాన స్థాయిలో జరగాలనే గ్రహింపు ఈ కవిత్వోద్యమాల్లో వ్యక్తమైనట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమానత్వం ఒక్కసారిగా సమకూరుతుందనే భావన నుంచి ముందుగానో, సమాంతరంగానో వర్గ వైరుధ్యాలతో పాటు లైంగిక, కుల వైరుధ్యాలు రూపుమాసిపోవాలనే ఆంతర్యంగా దాన్ని చెప్పుకోవచ్చు.

తెలుగు కవిత్వంలో మరోమారు వస్తు మార్పిడికి తెలంగాణ కవిత్వం అంటే స్థానీయ కవిత్వం కొండ గుర్తు అవుతుంది. తెలంగాణ నుంచి వచ్చేదంతా తెలంగాణ కవిత్వమని చెప్పకూడదనేది కొత్త నిర్వచనాన్ని తెలంగాణ భౌగోళిక ఉద్యమం ఇచ్చింది. ప్రాంతీయతను లేదా స్థానికతను ఆలంబనగా చేసుకుని ఈ కవిత్వం వచ్చింది. సామాజిక పరిణామక్రమాన్ని మలుపు తిప్పే లక్ష్యంతో ఈ కవిత్వం వచ్చింది. రెండు భిన్న తెలుగు సమాజాల మధ్య అసమానహోదాలు, అసమానావకాశాలు, వివక్ష తెలంగాణ కవిత్వానికి వస్తువులయ్యాయి. అంటే వాటికి సంబంధించిన భావనలు వస్తువుగా ముందుకు వచ్చాయని చెప్పాలి. అయితే, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ కవిత్వానికి భౌగోళిక తెలంగాణా రాష్ట్ర సాధన ఒక పార్శ్వంకాగా, ప్రపంచీకరణ వ్యతిరేకత దాని ప్రాపంచిక దృక్పథం. భౌతిక ఆధిపత్యం అవసరం లేకుండానే సాంస్కృతిక ఆధిపత్యం ద్వారా సామ్రాజ్యవాదం పెత్తనాన్ని వ్యతిరేకించే లక్షణం తెలంగాణ ప్రాంతీయ ఉద్యమంలో ఉంది, అదే కవిత్వంలోనూ వ్యక్తమవుతోంది. స్థానికోద్యమాలు మాత్రమే సామ్రాజ్యవాదానికి అత్యున్నత రూపమైన ప్రపంచీకరణకు సమాధానం చెబుతుందనే ఎరుక తెలంగాణ సాహిత్యకారులకు ఉంది. తద్వారా ఇది సాంస్కృతిక ఉద్యమ అవసరాన్ని గుర్తుచేస్తుంది. దళిత ఉద్యమం నిజానికి ఈ దిశలో సాగాల్సి ఉండింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం ఆ దారి పట్టింది. దానివల్ల వివక్షను ప్రశ్నించడం, ఆధిపత్య వర్గాలపై విమర్శలు చేయడం నుంచి తెలంగాణ ప్రాంతీయ కవిత్వం తన సాంస్కృతిక, సామాజిక ఔన్నత్యం గురించి మాట్లాడుతోంది. స్ర్తి, దళితవాద కవుల మాదిరిగానే ఆత్మగౌరవం గురించి, సమాన హోదా గురించి, సమాన హక్కులగురించి మాట్లాడుతూనే సామ్రాజ్యవాదులకు, వలస పాలకులకు నడుమ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సెక్షన్లను ప్రశ్నిస్తోంది. తెలుగు కవిత్వంలో వస్తు పరిణామక్రమాన్ని పరిశీలించినపుడు శిల్పం కూడా మారినట్లు మనం గమనిస్తాం. వస్తువు దానంతటదే శిల్పాన్ని నిర్ణయిచుకుంటుందనే మాటలోని అర్థం అదే. వస్తువు మారినప్పుడు తప్పకుండా నిర్మాణం, పాత వ్యక్తీకరణ పద్ధతులు, అభివ్యక్తి మారాల్సి వస్తుంది. అలాంటప్పుడు తప్పకుండా శిల్పం మారి తీరుతుంది. అంటే, వస్తువును కళాత్మకంగా వ్యక్తం చేయడానికి అవసరమైన పనిముట్లను కొత్తగా తెచ్చుకుంటుంది.

-కాసుల ప్రతాప రెడ్డి

English summary
Subject in Telugu poetry changed according to the social evolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X